ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. శుక్రవారం విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి వెళ్ళే పల్లెవెలుగు బస్సులో షర్మిల ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో టిక్కెట్ కొని.. ఉచితం ఎప్పుడిస్తారు అంటూ సర్కార్‌కు సూటి ప్రశ్న వేశారు. ఉచిత ప్రయాణం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పీసీసీ చీఫ్ పోస్ట్ కార్డు రాశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయిందని.. అయినా ఉచిత బస్సు ప్రయాణంపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వారంలో అమలు చేశారని... ఏపీలో పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనా అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని.. రోజు మహిళల ద్వారా రూ.7 కోట్ల ఆదాయం... నెలకు రూ.300 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. ఉచిత ప్రయాణం కల్పిస్తే... ఈ రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాల్సి వస్తుందని భయమా అని నిలదీశారు.