పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం ప్రజాప్రతినిధుల సమావేశం శుక్రవారం మొదలైంది. ఎన్టీఆర్ ప్రతిమకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తుందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలన్నారు. చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని సూచించారు. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను సమన్వయం చేసుకోవాలన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. ఈ విధంగా అధికారులు సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదన్నారు.
వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందని తెలిపారు. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదన్నారు. కేంద్ర నిధులను కూడా ఇష్టానుసారం మళ్లించేశారని మండిపడ్డారు. మనం ఇప్పుడు ప్రవర్తించే విధానం వల్లే వచ్చే ఎన్నికల ఫలితాలు, మెజారిటీ ఆధారపడి ఉంటాయన్నారు. ఎన్ని అరాచకాలు చేయకపోతే 151 సీట్లు వచ్చిన వైసీపీ 11కి పడిపోయిందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలని అన్నారు. ‘‘మనమూ అదే తీరున వెళ్తే రాష్ట్రం మళ్లీ రావణ కాష్టమే.. తప్పు చేసిన వారిని వదిలి పెట్టకూడదు, అలాగని కక్షసాధింపులకు వెళ్లకూడదు... ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. సంఘటిత శక్తిగా పనిచేస్తేనే ప్రజల అంచనాలను అందుకోగలం. ఎన్డీఏలో ఎవ్వరు తప్పు చేసినా ఆ ప్రభావం ముఖ్యమంత్రి మీదే ఉంటుందని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నాయకుడికి విశ్వసనీయత రావాలంటే ఎంతో సమయం పట్టినా... చెడకొట్టుకోవాలనుకుంటే నిమిషం చాలు. నాతో సహా ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. తదుపరి ఎన్నికలకు సిద్ధమవుతున్నామనే సంకేతం ఇచ్చేందుకే నిన్న ప్రధాని ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ఐదు గంటలు కూర్చున్నారు. ఇక్కడ మనమూ అదే సిద్ధాంతాన్ని అనుసరించాలి’’ అని స్పష్టం చేశారు. ‘‘గత ఐదేళ్లు సాగిన అరాచకం కారణంగా నాతో సహా, ప్రజలు, నేతలు అంతా ఇబ్బంది పడ్డారు. గెలిచాం కాబట్టి ఇక మన పని అపోయిందనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలి. యువత, విద్యావవంతులు ఇలా దాదాపు 65 మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు. మంత్రుల్లో 18 మంది కొత్తవారే ఉన్నారు. ప్రతీ ఇంట్లోనూ చిన్నపాటి సమస్యలుండి సమన్వయం చేసుకున్నట్లే... కుటుంబం లాంటి పార్టీలోనూ ఉండటం సహజం’’ అని చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.