జైలులో ఉన్న 31 ఏళ్ల పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు ఉత్తర భారతదేశంలో మాత్రమే గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని బహిరంగంగా కాల్చి చంపడం వంటి ఘటనలతో.. దేశవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా జైలులోనే ఉంటూ తన అనుచరులతో నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న లారెన్స్ బిష్ణోయ్‌పై ఒక వెబ్ సిరీస్ తీసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ జానీ పైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ ముందుకు వచ్చింది.
లారెన్స్ బిష్ణోయ్ జీవితం ఆధారంగా త్వరలోనే ఒక వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నట్లు జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ తాజాగా వెల్లడించింది. ఈ వెబ్ సిరీస్‌కు "లారెన్స్.. ఏ గ్యాంగ్‌స్టర్ స్టోరీ" అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసింది. మరికొన్ని రోజుల్లో రానున్న దీపావళి పండగ సందర్భంగా.. ఈ "లారెన్స్.. ఏ గ్యాంగ్‌స్టర్ స్టోరీ" ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఇక ఈ టైటిల్‌కు సంబంధించి ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఈ "లారెన్స్.. ఏ గ్యాంగ్‌స్టర్ స్టోరీ" వెబ్ సిరీస్‌ను వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు ప్రొడ్యూసర్ అమిత్ జానీ వెల్లడించారు. స్టూడెంట్ లీడర్‌గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఏం చేశాడు అనే అంశాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల దేశంలో సంచలనం సృష్టించిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యను కూడా ఇందులో చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆడియన్స్‌ను ఆకట్టుకునే విధంగా లారెన్స్ బిష్ణోయ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు అమిత్ జానీ తెలిపారు.
ఇక ఇలాంటి వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేయడం జానీ ఫైర్ ఫాక్స్ ఫిల్మ్స్ ప్రొడక్షన్‌కు కొత్తేమీ కాదు. వాస్తవ ఘటనలు ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులు తెరకెక్కించడంలో ఆ సంస్థకు మంచి పేరు ఉంది. ఇప్పటికే ఆ సంస్థ ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ సాహు నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని తీసిన "ఏ టైలర్ మర్డర్ స్టోరీ".. అంతేకాకుండా పబ్జీలో పరిచయం అయిన సచిన్ అనే యువకుడి కోసం పాకిస్తాన్ నుంచి పిల్లలతో కలిసి వచ్చిన సీమా హైదర్ కథ ఆధారంగా తీసిన "కరాచీ టు నోయిడా" అనే సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా లారెన్స్ బిష్ణోయ్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలవడంతో అతడిపై వెబ్ సిరీస్ తీయాలని ఆ సంస్థ నిర్ణయించుకుంది.