ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మరో శుభవార్త అందింది. ఢిల్లీ లిక్కర్ పాలసీతోపాటు పలు కేసుల్లో ఆప్ కీలక నేతలు అంతా జైలు పాలు కాగా.. ఢిల్లీ పాలనతోపాటు, పార్టీ కూడా తీవ్ర కకావికలం అయింది. ఇటీవలి కాలంలో ఒక్కొక్కరుగా బెయిల్‌పై బయటికి వస్తుండటం.. ఆ పార్టీకి కాస్త ఊరటగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా మరో నేతకు కూడా బెయిల్ వచ్చింది. గత 2 ఏళ్లకు పైగా జైలులో ఉంటున్న ఢిల్లీ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌కు తాజాగా బెయిల్ మంజూరు అయింది.
సత్యేందర్ జైన్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఆయనకు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ లావాదేవీల కేసులో సత్యేందర్ జైన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. 2022 మే 30వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారు.
2015-2016 మధ్య హవాలా నెట్‌వర్క్ ద్వారా షెల్ కంపెనీల నుంచి సత్యేందర్ జైన్ కంపెనీలకు.. సుమారు రూ.4.81 కోట్ల వరకు డబ్బులు చేతులు మారినట్లు దర్యాప్తులో ఈడీ అధికారులు గుర్తించారు. అయితే ఈ కేసులో మొదట సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా.. దాని ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఈ హవాలా కేసులో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో సత్యేందర్ జైన్‌తో పాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ క్రమంలోనే సత్యేందర్ జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టి తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆయనకు జైలులో సకల సౌకర్యాలు అందుతున్నాయని మొదట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతడికి ఓ వ్యక్తి కాళ్లు నొక్కుతూ, మసాజ్ చేస్తున్నట్లు ఉన్న జైలులోని సీసీటీవీ దృశ్యాలు కూడా అప్పట్లో బయటికి రావడం.. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం అప్పట్లో తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. మరికొన్ని నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జైళ్లకు వెళ్లిన ఆప్ నేతలు బెయిల్‌పై బయటికి రావడం ఆ పార్టీకి పెద్ద ఊరటగా మారింది.