ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు మోతెక్కిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో టమాటా ధర సెంచరీ దాటిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో కిలో రూ.150 వరకు కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టమాటా దొంగలు కూడా పెరిగిపోతున్నారు. అయితే టమాటా లోడుతో వెళ్తున్న ఓ లారీ కాస్తా రోడ్డుపై ప్రమాదానికి గురి కావడం స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారింది. అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకోవడంతో.. రాత్రంతా పోలీసులు ఆ టమాటాలకు కాపలాగా నిద్ర మానుకుని రోడ్లపై పడిగాపులు కాశారు. అయితే ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో ఈ లారీ ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి 18 టన్నుల టమాటా లోడు ఢిల్లీకి తరలిస్తుండగా.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. టమాటా లోడుతో వెళ్తున్న లారీ.. కాన్పూర్ సమీపంలోకి రాగానే.. ఎదురుగా రోడ్డుపై డ్రైవర్‌కు ఆవు కనిపించింది. దాన్ని గుర్తించిన లారీ డ్రైవర్.. తప్పించేందుకు ప్రయత్నించడంతో లారీ అదుపుతప్పి ఒక పక్కకు బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ క్లీనర్‌కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే ఆ లారీ వెనకాలే స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ.. లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమెకు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదంలో లారీ బోల్తాపడటంతో అందులో ఉన్న టమాటా బాక్స్‌లు మొత్తం రోడ్డుపై పడ్డాయి. దీంతో టమాటాలు మొత్తం అక్కడ చెల్లా చెదురుగా పడిపోయాయి. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని లారీ డ్రైవర్ స్థానిక పోలీసులకు అందించడంతో వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను, లారీ క్లీనర్‌ను దగ్గర్లో ఉన్న హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే ప్రస్తుతం టమాటా ధరలు మండిపోతుండటంతో.. రోడ్డుపై పడిపోయిన టమాటాలను ఎత్తుకుపోకుండా పోలీసులు రాత్రంతా అక్కడే కాపలాగా ఉన్నారు. లారీ బోల్తా పడిన ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గ్రామస్థులు.. టమాటాలు ఎత్తుకుపోకుండా పోలీసులు చూశారు.