కన్నడనాట సంచలనం రేపుతున్న మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - ముడా కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారుల బృందం శుక్రవారం తనిఖీలు నిర్వహించింది. 12 మంది అధికారుల బృందం.. మైసూరులోని ముడా ఆఫీస్‌కు వెళ్లి.. ముడా కమిషనర్ రఘునందన్ సహా పలువురు అధికారులను కలిసింది. అంతేకాకుండా ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు సీజ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు ద్వారా తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరు ముడా అధికారులను ఈడీ అధికారులు.. విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈడీ అధికారుల తనిఖీల సందర్భంగా కేంద్ర పారామిలటరీ ఫోర్స్ వారి వెంబడి భద్రత కోసం రావడం గమనార్హం. మైసూరులోని వివిధ ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అయితే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గానీ.. ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో గానీ, వారికి సంబంధించిన వారి ఇళ్లల్లో సోదాలు జరగలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇటీవలె అనారోగ్యం కారణంగా ముడా ఛైర్మన్ కే మరిగౌడ రాజీనామా చేయడం.. ఆ వెంటనే ఈడీ అధికారులు రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
సిద్ధరామయ్య భార్య పార్వతి.. వివిధ ప్రాజెక్టుల కోసం మైసూరులోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తన 3.16 ఎకరాల భూమిని ఇవ్వడంతో ముడా పరిధిలోని 14 ప్లాట్లను ఆమెకు కేటాయించారు. ఇందులో రూ.45 కోట్ల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావమరిదిపై ఆరోపణలు వచ్చాయి. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యతో పాటు మాజీ ఛైర్మన్ కే మరిగౌడ ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఈ ముడా స్కామ్ ఆరోపణలు రావడంతో ఆ ప్లాట్లను సిద్ధరామయ్య భార్య తిరిగి ముడాకు అప్పగించింది. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సీఎం సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేయగా. అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.