ట్రెయిన్ టిక్కెట్ల రిజర్వేషన్ ముందస్తు బుకింగ్‌ను 120 రోజుల నుంచి 60 రోజులకు కుదిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, దీనిపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. టిక్కెట్ రిజర్వేషన్ల గడువు ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువుగా అవుతుండటం వల్ల బెర్తులు వృథా అవుతున్నాయని తెలిపింది. అంతేకాదు, పలు రకాల మోసాలు, రైల్వే అధికారుల అక్రమాలకు అవకాశం కల్పిస్తోందని పేర్కొంది. వీటిని నిరోధించేందుకు అడ్వాన్స్ బుకింగ్ కాల పరిమితిని కుదించామని స్పష్టం చేసింది.
‘ముందస్తు రిజర్వేషన్లకు 120 రోజుల గడువు ఉండటం వల్ల క్యాన్సిలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి.. ఇది ప్రస్తుతం 21 శాతంగా ఉంటోంది.. టిక్కెట్లు బుక్ చేసుకున్నవారిలో 4- 5 శాతం మంది ప్రయాణించడం లేదు.. అలాంటి వారు టికెట్ రద్దు చేసుకోకపోవడంతో సీట్లు/ బెర్తులు వృథాగా పోతున్నాయి.. ఇది పలు రకాల మోసాలు, రైల్వే అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు వంటి ఘటనలకు కారణమవుతోంది. ప్రస్తుత నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చు’ అని రైల్వే బోర్డు వెల్లడించింది.
దీంతోపాటుగా గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంత మంది ముందస్తుగానే సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటోంది.. గడువు తక్కువ ఉంటే నిజమైన ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. తక్కువ సంఖ్యలో క్యాన్సిలేషన్లు, ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయడానికి రైల్వేశాఖకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అడ్వాన్స్‌డ్ బుకింగ్ గడువులో కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని రైల్వే బోర్డు పేర్కొంది. గతంలో 30 నుంచి 120 రోజుల వరకు ఉండేదని చెప్పింది. వివిధ అనుభవాల ఆధారంగా తాజా 60 రోజుల సమయం ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించామని తెలిపింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 1981 నుంచి ఏప్రిల్ 2015 వరకు 12 సార్లు మార్పులు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
ముందస్తు రిజర్వేషన్ కాలపరిమితి 120 నుంచి 60 రోజులకు తగ్గిస్తూ తీసుకొచ్చిన నిబంధన నవంబరు 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల జనరల్ క్లాస్ టిక్కెట్‌లపై ఎటువంటి ప్రభావం ఉండదని బోర్డు స్పష్టం చేసింది. ఎందుకంటే ఇవి రైలు బయలుదేరడానికి ముందు స్టేషన్‌లోనే అప్పటికప్పుడు తీసుకుంటారని పేర్కొంది. అయితే, ఇప్పటికే 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తగా రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే టికెట్ బుకింగ్ చేసుకున్న వారిని ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. వారి రిజర్వేషన్ ప్రకారం బెర్తుల కేటాయింపు ఉంటుందని ఎక్స్ ద్వారా సమాచారం ఇచ్చింది.