ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రూ.5 కోట్లు ఇవ్వకుంటే..సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతాం’: సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

national |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 11:24 PM

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యోదంతం సంచలనంగా మారింది. ఈ తరుణంలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని, లేకుంటే సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ముంబయి ట్రాఫిక్‌ పోలీసుల వాట్సాప్‌ నంబర్‌కు గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెసేజ్‌ పంపారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.


‘బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు... సల్మాన్‌ ఖాన్‌ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాలి... ఈ మొత్తం ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ కంటే ఆయన దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని దుండగులు హెచ్చరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, మెసేజ్‌ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నామని ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ నెంబరు ఎవరిదో గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ నివాసం వద్ద భద్రతను పెంచారు. గతంలో బెదిరింపులు రావడం, ఆయన స్నేహితుడైన సిద్ధిఖీని దారుణంగా హత్య చేయడంతో పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


సిద్ధిఖీ హత్య కేసుపై విచారణ కొనసాగుతుండగా.. గురువారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కీలక సభ్యుడ్ని అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌కు చెందిన అతడ్ని సుఖ్‌బిర్ బల్బీర్ సింగ్‌‌గా గుర్తించారు. సల్మాన్ హత్యకు కుట్రతో అతడికి సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. లారెన్స్ ముఠాలోని ఇతర సభ్యులతో అతడు కాంట్రాక్ట్ కుదర్చుకున్నట్టు సమాచారం. దాడికి వ్యూహరచనపై లారెన్స్ గ్యాంగ్‌లోని పాకిస్థాన్‌కు చెందిన డోగర్‌‌ను సుఖ్‌బీర్ సింగ్ నేరుగా సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు. అతడి ద్వారానే పాకిస్థాన్ నుంచి ఏకే-47ఎస్, ఎంఐ16ఎస్, ఏకే 92 ఎస్ వంటి అత్యాధునిక ఆయుధాలను అక్రమంగా పాక్ నుంచి అందుతున్నట్టు వెల్లడయ్యింది.


సల్మాన్ ఖాన్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ కుట్రకు సంబంధించిన విస్తృత దర్యాప్తు పురోగతిలో సింగ్ అరెస్టు తాజాది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ ఖాన్ నివాసం వద్ద జరిగిన కాల్పుల ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. 18 మందిని నిందితులుగా చేర్చారు. దీనిపై దర్యాప్తు జరుగుతుండగానే సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్యచేసింది. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్, అతడి సోదరుడు అనమోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, రోహిత్ గోధారా సహా ఆ ముఠాలోని అత్యంత కీలకమైన సభ్యులు నిందితులుగా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్యక్తులు చాలా కాలంగా బెదిరింపులు, హింసాత్మక చర్యలతో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com