తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన ప్రతిపాదన చేశారు. తమ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని రీ కాల్ చేయాలని.. ఆయన తమకు వద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో చాలా రోజులుగా గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య లొల్లి నడుస్తోంది. ఈ లొల్లి తాజాగా పీక్స్ కు చేరుకున్నది. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఉద్దేశపూర్వకంగానే ‘ద్రవిడ’ అనే పదం పలకకుండా దాటవేశారని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు.చెన్నైలోని దూరదర్శన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరిగింది. ఇదే ఈవెంట్‌లో హిందీ మాసోత్సవం కూడా నిర్వహించారు.
హిందీని, హిందీ భాషేతర రాష్ట్రాల ఈవెంట్‌ను కలిపి నిర్వహించడాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ తొలుత తప్పుబట్టారు. అలాగే, ఈవెంట్ సందర్భంగా రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ.. ద్రవిడ అనే పదాన్ని గాయకులు దాటవేయడంపై వివాదం నెలకొంది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణ కూడా చెప్పింది. గాయకుల పొరపాటుగా పేర్కొంది. అదే ఈవెంట్‌లో పాల్గొన్న గవర్నర్ కూడా ‘ద్రవిడ’ అనే పదాన్ని ఉచ్చరించకపోవడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన.. గవర్నర్ పదవికి ఏమాత్రం అర్హులు కాదంటూ ఆరోపించారు. రాష్ట్ర గేయంలో ఆ పదాన్ని ఉచ్చరించకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.