గ్రూప్ 1 అభ్యర్థులు పట్టు వదలని విక్రమార్కుడిలా ఆఖరి నిమిషం వరకు పోరాటం చేస్తున్నారు. జీవో నంబర్ 29 రద్దు చేయాలని వాళ్లు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఉద్యమం ఇటీవల తారస్థాయికి చేరింది. హైకోర్టులో అభ్యర్థులకు చుక్కెదురైంది. మరోవైపు పరీక్ష కోసం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చివరి క్షణం వరకు పోరాడేందుకు సమాయత్తమయ్యారు గ్రూప్ 1 అభ్యర్థులు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు.
సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా.. సీఎం రేవంత్ రెడ్డి పెడచెవిన పెట్టారని అన్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకోక ముందే ప్రభుత్వం దిగివచ్చి జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం... జీవో 29 వల్ల నష్టపోయే విద్యార్థులవైపు నిలబడాలని డిమాండ్ చేశారు.