తిరుమల శ్రీవారిని నిత్యం ఎంతో మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఇలా తిరుమలకు వచ్చే భక్తుల్తో కొంతమంది సొంత వాహనాల్లో వస్తే.. మరికొందరు ప్రైవేట్ వాహనాలు ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక ప్రజారవాణా వ్యవస్థలు అయిన ఆర్టీసీ, ఐఆర్‌సీటీసీ కూడా యాత్రికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటాయి.. మరీ ముఖ్యంగా యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలు తీసుకువస్తూ ఉంటుంది. అలాగే వేర్వేరు ప్రాంతాల నుంచి తిరుమలకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది.
విజయవాడ నుంచి తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ ఈ ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా అక్టోబర్ 31న విజయవాడ నుంచి తిరుమలకు రైలు బయల్దేరుతుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. తిరుమల,కాణిపాకం, శ్రీకాళహస్తి వెళ్లాలనుకునేవారు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టికెట్లు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. కంఫర్ట్, స్టాండర్డ్ తరగతులలో టికెట్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ ప్యాకేజీలో సింగిల్, డబుల్‌తో పాటుగా పసిపిల్లలు ఉన్నవారికి కూడా ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి జరగనున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ జేఈవో శుక్రవారం అధికారులతో కలిసి అమ్మవారి ఆలయం, పుష్కరిణి, మాడవీధులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అమ్మవారి మూలమూర్తి దర్శనంతో పాటు వాహన సేవలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలలో చివరిరోజైన పంచమి తీర్థం రోజున భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని.. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. పుష్కరిణిలోకి వెళ్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని.. తమిళనాడు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తమిళంలో సైన్ బోర్డులు సిద్ధం చేయాలని సూచించారు.