వైఎస్ఆర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. బద్వేల్ పట్టణానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని శనివారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే స్థానికంగా ఉన్న ఓ ఫ్లైవుడ్ షాప్ వద్దకు రాగానే విగ్నేష్ అనే యువకుడు ఆమెపై దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే బాధితురాలి అరుపులు, కేకలతో చుట్టుపక్కల వారు ఈ సంగతి గమనించి.. విద్యార్థినిని బద్వేలు ఆస్పత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విగ్నేష్ కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
అయితే బాధితురాలు ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే విగ్నేష్ ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు ఆమె కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఆరునెలల క్రితమే విఘ్నేష్‌కు వేరే అమ్మాయితో పెళ్లి జరిగిందని.. అయితే పెళ్లైన తర్వాత కూడా విగ్నేష్ నుంచి వేధింపులు కొనసాగాయని చెప్తున్నారు. ఈ క్రమంలోనే తనను కలవకపోతే చచ్చిపోతానని బెదిరించి.. విద్యార్థినిని అటవీ ప్రాంతానికి తీసుకొచ్చిన విగ్నేష్.. తన మాట వినకపోవడంతో డ్రస్‌కు లైటర్‌తో నిప్పంటించిన పారిపోయినట్లు తెలిసింది. మరోవైపు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆదేశించారు.
మరోవైపు ప్రేమ పేరుతో యువకుడి నుంచి వేధింపులు తట్టుకోలేక కర్నూలు జిల్లాలో ఓ అమ్మాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆస్పర్తి మండలానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినిని సన్నీ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ప్రేమించాలంటూ ఆమె వెంట పడుతున్నాడు. అయితే ఆ అమ్మాయి అతని ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. దీంతో అమ్మాయిపై కోపం పెంచుకున్న సన్నీ.. ఉన్నాదిలా మారిపోయాడు.
హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న ఆ అమ్మాయి.. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చింది. ఇక శుక్రవారం ఆ విద్యా్ర్థిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోనికి ప్రవేశించిన సన్నీ.. అమ్మాయిను మరోసారి వేధింపులకు గురిచేశాడు. దీంతో తమ కూతురు పురుగుల మందు తాగి చనిపోయిందని.. బాలిక కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై అమ్మాయి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. సన్నీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.