సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుబడిగా పెట్టలేరు. తాము కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత దాచి పెట్టుకుంటుంటారు. భవిష్యత్తు అవసరాలకు వాటిని వాడుకుంటారు. ఇలా నెల నెలా కొంత పొదుపు చేసుకునేందుకు పేద, సామాన్య ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అందిస్తోంది. ఈ ఖాతాను ఏదైనా బ్యాంకులోనూ తీసుకోవచ్చు. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక లేదా వార్షికంగా పొదుపు చేయవచ్చు. దీర్ఘకాలంలో మంచి రాబడి అందుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, పోస్టాఫీసులోనూ మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి. అయితే, ఎందులో ఎక్కువ వస్తుందో తెలుసుకుందాం.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్లు..
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రికరింగ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు ఇస్తోంది. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి నెలకు రూ.100 నుంచి జమ చేయవచ్చు. ఆపైన ఎంతైన దాచుకోవచ్చు. ప్రస్తుతం 5 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్‌పై గరిష్ఠంగా 6.70 శాతం వడ్డీ ఇస్తోంది. మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించి ఖాతాలో జమ చేస్తారు. దానిపైనా వడ్డీ వస్తుంటుంది. ఉదాహరణకు మీరు నెలకు రూ.500 చొప్పున పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ ఖాతాలో పొదుపు చేస్తున్నారు అనుకుందాం. మీ డబ్బులు 5 ఏళ్ల నాటికి రూ.30 వేలు అవుతాయి. దానిపై వడ్డీ రూ.5,680 వరకు వస్తాయి. అంటే మొత్తంగా చేతికి రూ.35,680 వరకు అందుతాయి.
బ్యాంక్ ఆర్‌డీ ఖాతా వడ్డీ రేట్లు..
ప్రస్తుతం చాలా బ్యాంకులు రికరింగ్ డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 6 నెలల నుంచి 10 ఏళ్ల టెన్యూర్ ఆర్‌డీ ఖాతాలపై 4.50 శాతం నుంచి 7 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే అదనంగా 75 బేసిస్ పాయింట్లు వడ్డీ ఇస్తోంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఏడాది నుంచి 10 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లపై 6.50 శాతం నుంచి 7 శాతం వడ్డీ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్లు అయితే 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ వడ్డీ ఇస్తోంది. ఒక సాధారణ కస్టమర్ ఎస్‌బీఐ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తెరిచి నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేస్తున్నారు అనుకుందాం. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత చేతికి అసలు రూ.30 వేలు, వడ్డీ రూ.5,500 వరకు అందుతాయి. రికరింగ్ డిపాజిట్ల విషయంలో 5 ఏళ్ల టెన్యూర్లపై పోస్టాఫీసులోనే కాస్త ఎక్కువ వడ్డీ ఉంది. బ్యాంకులు కాస్త తక్కువ వడ్డీ ఇస్తుంటాయి. అయితే చాలా స్వల్ప తేడా ఉంటుంది. ఎందులో పొదుపు చేసుకున్న రాబడిలో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. అలాగే డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా బీమా హామీ సైతం ఉంటుంది. పోస్టాఫీసులో కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది.