డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగులను ఓ పాస్టర్ నిలువునా ముంచేశాడు. వారందరిని ఇజ్రాయోల్ పంపుతానంటూ నిరుద్యోగులకు నమ్మబలికాడు. ఆ క్రమంలో వారి వద్ద నుంచి కోట్లాది రూపాయిల నగదు వసూల్ చేశాడు. కాలం గడుస్తున్న ఇజ్రాయోలు మాత్రం పంపకపోవడంతో నిరుద్యోగులకు సందేహం వచ్చింది. దీంతో తమను ఇజ్రాయోల్ పంపాలి.. లేకుంటే నగదు వాపస్ ఇవ్వాలంటూ పాస్టర్‌ను నిలదీశారు. దీంతో ఆగ్రహించిన పాస్టర్.. వారిని చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం పాస్టర్ నగదు తీసుకుని పరారయ్యాడు. దీంతో బాధితులుగా మారిన నిరుద్యోగులు జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీని ఆశ్రయించారు. వారి సూచనలతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే బాధితులంతా.. అమలాపురం, అల్లవరం, రాజోలు, గన్నవరం, ఒంగోలుకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. పాస్టర్‌కు తాము రూ.1.50 కోట్ల నగదు చెల్లించామని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు స్పష్టం చేశారు. పాస్టర్ వల్ల 31 మంది బాధితులుగా మారామని వారు పేర్కొన్నారు. విశ్వాసుల ప్రార్ధన మందిరం పేరుతో పాస్టర్ సంఘం నడుపుతూ తమ వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూల్ చేశాడని పోలీసుల ఎదుట బాధితులు వాపోయారు. ఇక పాస్టర్ జాడా తెలుసుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.