అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం రూ.906 కోట్లు ఇచ్చి మమ అనిపించి... మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బాధితులను మోసం చేసింది కాబట్టే ఓడిపోయిందన్నారు. పిలవని పేరంటానికి అన్నట్లుగా జగన్ వచ్చి ఆనాడు నేను ఆదుకుంటానని, ఆరు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారని.. ఐదేళ్లు పాలన సాగించిన జగన్.. అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఆలకించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కనీసం అర్జీ తీసుకునేందుకు కూడా జగన్ సమయం ఇవ్వలేదన్నారు. కూటమి నేతలు ఇచ్చిన హామీలను నమ్మి 36 లక్షల మంది బాధితులు ఓట్లు వేశారన్నారు. ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి బాధితులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చామన్నారు. ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సమర్ధ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేసుకుంటున్నారని.. వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉంచి ఆస్తులను ఆక్షన్ పెట్టాలని వినతి చేశారు. బాధితులకు ఇవ్వగా, ఇంకా అదనంగా కూడా డబ్బులు వస్తాయని ప్రభుత్వానికి విన్నవించామన్నారు. చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. ఈనెల 28వ తేదీన ధర్నా చౌక్‌లో బాధితులతో కలిసి మహా విజ్ఞాపన దీక్ష చేపడుతున్నామని ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు.