బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడనం తుపానుగా మారనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు దానా తుపానుగా నామకరణం చేశారు. ఇక తుపాను ప్రభావంతో 23, 24, 25వ తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురవొచ్చన్న అంచనాల మధ్య ఏపీలో భారీగా రైళ్లను రద్దు చేసింది. అక్టోబర్ 23న 18, అక్టోబర్ 24న 37, అక్టోబర్ 25న 11 రైళ్లు.. మొత్తంగా 66 రైళ్లను రద్దుచేసింది. ఈ మేరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. రద్దైన రైళ్లల్లో కన్యాకుమారి- దిబ్రూఘఢ్ ఎక్స్‌ప్రెస్, సిల్చార్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, షాలిమార్- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, హౌరా - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ సహా అనేక రైళ్లు ఉన్నాయి.
రద్దైన రైళ్ల జాబితా ఇదే..
మరోవైపు వాయుగుండం బుధవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 24వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా మారుతుందని.. 24వ తేదీ రాత్రి లేదా 25 ఉదయం పూరీ, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించింది. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది. తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ వర్షా్లు కురుస్తాయని అంచనా వేసింది.
మరోవైపు వాయుగుండం ప్రభావంతో అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి.. అనంతపురం సమీపంలోని పండమేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. పలు చోట్ల వాహనాల రాకపోకలకు సైతం అంతరాయం కలిగింది. ముఖ్యంగా రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. కనగానపల్లి చెరువుకు గండి పడింది. ప్రసన్నాయపల్లి నుంచి ఉప్పరపల్లి వరకు పండమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో సమీప కాలనీలు నీటిలో మునిగిపోయాయి.