విజయవాడను బుడమేరు వరద ముంచెత్తితే.. అనంతపురంపై పండమేరు విరుచుకుపడింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని కాలనీలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు.. అనంతపురంనకు ఆనుకుని ఉన్న పండమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగడంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వర ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పండమేరుకు పోటెత్తిన వరదతో ఉప్పరపల్లి పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ నీట మునిగింది. విజయవాడ తరహాలోనే వరద దెబ్బకు ఇళ్లన్నీ నీటమునిగాయి.. వాహనాలకు నీటిలో కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ వదర ప్రభావి ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు అధికారులు. పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
కనగానపల్లి చెరువు కట్ట తెగడంతో.. వరద పండమేరులోకి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి 44పై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పెట్రోట్ బంక్‌లోకి నీరు చేరింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
అనంతపురం జిల్లాలో గత కొన్ని గంటల్లో ఏకంగా 125 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా 100 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 25 వరకు దక్షిణ రాయలసీమతో పాటూ బెంగళూరుకు వర్ష సూచన ఉంది.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో కూడా కుండపోతగా వాన పడుతోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి నుంచి రామగిరి, చెన్నే కొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కనగానపల్లి చెరువుకు గండి పడటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. రామగిరి - ఎన్‌ఎస్ గేట్, ముత్తవకుంట్ల - కనగానపల్లి, తగరకుంట - కనగానపల్లి రహదారులన్నీ బ్లాక్ అయ్యాయి. వర్ష బాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సునీత పర్యటిస్తున్నారు.