తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో దారుణం జరిగింది. రాజకీయ కక్షలతో టీడీపీ నేత మల్లారపు హరిప్రసాద్‌ను దారుణంగా హతమార్చారు. సోమవారం రాత్రి హరిప్రసాద్ తన బంధువు చెలగల కాటయ్యతో కలిసి బయటకు వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి వచ్చి కాటయ్య ఇంట్లో హరిప్రసాద్ నిద్రిస్తుండగా.. మంగళవారం వేకువజామున కొందరు దుండగులు అక్కడికి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. వెంటనే గమనించి కొందరు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హరిప్రసాద్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన కట్టా రామచంద్రారెడ్డి, దుంపల మధు, అతడి అనుచరులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చనిపోయిన హరిప్రసాద్ కుటుంబ సభ్యులు ఆఱోపిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మరికొందరిపైనా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఊరిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు పెళ్లకూరు మండలం చిల్లకూరులో కూడా రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ డీసీసీబీ ఛైర్మన్ సత్యనారాయణరెడ్డి ఇంటి దగ్గర పెద్ద హైడ్రామా నడిచింది. అక్కడికి వెళ్లిన టీడీపీ నేత చైతన్య కృష్ణారెడ్డి కారును స్థానికులు చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. కొందరు గాజు సీసాలు రోడ్డు మీద పగలగొట్టారు, బైకులపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. కొంతమంది పోలీస్ వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. సీఐ వాహణాన్ని కొందరు రాళ్లతో కొట్టారు. కొద్దిసేపటి తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ గొడవలకు సంబంధించి.. పునబాకకు చెందిన లోకేశ్ ఫిర్యాదు చేయడంతో.. సత్యనారాయణరెడ్డితో పాటు 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సర్పంచి పగడాల హరిబాబురెడ్డి ఫిర్యాదుతో 8 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ గొడవలు వ్యక్తిగతమైనవని.. దీనికి రాజకీయ రంగు పూయడం సరికాదన్నారు మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. బాకీ డబ్బులు విషయంలో గొడవగా క్లారిటీ ఇచ్చారు. చిల్లకూరులో జరిగిన గొడవలు పార్టీకీ సంబంధం లేదన్నారు.