విశాఖపట్నం జిల్లా సింహాచలంలో కొలువై ఉన్న అప్పన్న స్వామి ఆభరణాలు గోల్డ్ డిపాజిట్ పథకంలో జమ అయ్యాయి. సింహాద్రి అప్పన్నకు భక్తులు కానుకల రూపంలో బంగారు ఆభరణాలు, వస్తువులను సమర్పిస్తారు. హుండీల్లో వేయడంతో పాటుగా.. స్వయంగా ఆలయ అధికారులకు కూడా అందజేస్తుంటారు. భక్తులు ఇలా సమర్పించిన సమర్పించిన బంగారు ఆభరణాలు, వస్తువులను అధికారులు ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. వీటిని తీసుకెళ్లి ఆలయ అధికారులు గోల్డ్ డిపాజిట్ పథకంలో జమ చేశారు.
సింహాచలం అప్పన్న ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, దేవాదాయశాఖ కమిటీ ఆధ్వర్యంలో ఆభరణాలు, బంగారు వస్తువుల్ని తూకం వేశారు. భక్తుల కానుకల రూపంలో లభ్యమైన 4.380 కిలోల బంగారాన్ని నగరంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ శాఖలో డిపాజిట్ చేశారు. ఈ మేరకు ఆ బంగారం మొత్తాన్ని బ్యాంకు ప్రతినిధి నరసింహరాజుకు అందజేశారు. ఇప్పటి వరకు దేవస్థానం దాదాపుగా 50కిలోల బంగారాన్ని డిపాజిట్ల రూపంలో జమ చేసింది.. వీటి నుంచి ఏటా సుమారు రూ.40లక్షల వరకు వడ్డీ సమకూరుతోంది. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం అధికారులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. సింహాచలం అప్పన్నను నిత్యం భక్తులు దర్శించుకుంటారు. స్వామివారికి బంగారం, వెండి, కరెన్సీ ఇలా తమకు తోచిన విధంగా హుండీలో వేసి.. తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా అప్పన్న ఆలయం హుండీలలో సమర్పించిన బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు.
మరోవైపు సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అపచారం జరిగింది. సింహగిరి కొండపై కొందరు మందుబాబులు రెచ్చిపోయారు. పెళ్లిళ్ల కోసం వచ్చిన కొందరు.. ఏకంగా ఆ దేవుడు సన్నిధిలో మందు కొడుతూ చిందులేశారు. సోమవారం ఎక్కువ వివాహాలు జరగ్గా.. కాటేజీలు, మండపాలు నిండిపోయాయి. ఈ వివాహాలకు హాజరయ్యేందుకు వచ్చిన కొందరు ఆలయానికి సమీపంలో మద్యం సేవిస్తూ కనిపించారు. సింహగిరిపై మద్యం, మాంసం నిషేధం ఉన్నా సరే.. నిబంధనల్ని ఉల్లంఘించి ఇలా ప్రవర్తించారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.