మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు, చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పూల మొక్కలు.. మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా కనిపించే వాతావరణం. ఇలా ప్రకృతి అందాలతో భూతల స్వర్గాన్ని తలపించే అరకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరకు అందాలను చూడాలంటే శీతాకాలంలో వెళ్లాలి.. ఆ సమయంలో దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తారు. అరకు పర్యటనలో వంజంగి మేఘాల కొండ, బొర్రా గుహలు, అనంతగిరి ఫారెస్ట్, గిరిజన మ్యూజియం, కాఫీ తోటలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఆకర్షణలు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి. అయితే అరకు పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేలా నేటి నుంచి సరికొత్త అడ్వంచర్ షో అందుబాటులోకి వచ్చింది.
అరకులో పర్యాటకానికి మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి హాట్ ఎయిర్ బెలూన్ షోను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ట్రయల్ రన్‌ని సక్సెస్ ఫుల్‌గా నిర్వహించగా.. నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అరకులో గతంలో హాట్ ఎయిర్ బెలూన్ షోలు నిర్వహించినా.. అవి కేవలం ప్రొఫెషనల్ పోటీలుగా జరిగాయి. కానీ ఇప్పుడు వాటిని టూరిస్టులకు కోసం అందుబాటులోకి తీసుకొస్తుండంతో అరకు టూర్ మరింత మజాగా మారనుంది.
అరకు లోయ ప్రకృతి అందాలకు పేరుగాంచింది. శీతాకాలంలో ఇక్కడ పూసే వలిస పువ్వులు పసుపు వర్ణంతో కొండలను మరింత అందంగా మార్చేస్తాయి. అరకు వెళ్లే మార్గంలో ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉన్న ఘాట్ రోడ్ ఆసక్తికరంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. సొంత వాహనాల్లో వెళ్లేవారు మార్గమధ్యలో ఆగి ఆ ప్రకృతి అందాలను కనులారా వీక్షిస్తూ మధురానుభూతి పొందుతుంటారు. ఇప్పుడు ఆ అందాలను హాట్ ఎయిర్ బెలూన్ల ద్వారా ఆకాశం నుంచి చూసే అద్భుత అవకాశం రావడంతో పర్యాటకులు ఎగిరి గంతేస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్లలో ప్రయాణించే పర్యాటకుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న ఈ షో కోసం టూరిస్టులు ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎక్కేందుకు ఒక్కొక్కరికి 1500 రూపాయల నుంచి రూ.2వేల వరకు ఛార్జి చేయనున్నట్లు తెలుస్తోంది.