ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. అది వారు ఆదర్శం కోసం చేసినా ఇతరులకు మాత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి కోవకు చెందినదే ఓ పిల్లాడికి పెట్టిన పేరు. సాధారణంగా తమ పిల్లలకు దేవుడికి సంబంధించినది కానీ తమ పూర్వీకులకు సంబంధించిన పేరు కానీ పెట్టుకుంటారు. ఇంకా కొందరు వెరైటీ కోసం ఇంటర్‌నెట్‌లో చూసి వినూత్నంగా ఉండేలా పెడతారు. కానీ తాడిపత్రికి చెందిన ఓ టీచర్ తన కుమారుడికి అంకెలతో పేరు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాడిపత్రిలోని సుంకులమ్మపాలెంకు చెందిన రాఘవేంద్ర, ప్రశాంతి దంపతులు తమ కుమారుడికి 126 అంటూ అంకెలతో పేరు పెట్టారు. రాఘవేంద్ర పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆధార్ కార్డు, డేట్‌ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, పాఠశాల రికార్డుల్లో కూడా126గా నమోదు చేయించాడు. ఎందుకిలా అని ప్రశ్నిస్తే 126 అంకెల్లో 1 అంటే ఐ, 2 అంటే యామ్, 6కి ఇండియన్ అని అర్థం వచ్చేలా పెట్టానన్నారు. కుల, మత బేధాలు ఉండకుండా అందరూ భారతీయులుగా జీవించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. తన కుమారుడికి ప్రస్తుతం ఆరేళ్ల వయసు ఉన్నా, పుట్టిన కొన్నిరోజులకే 126పేరు పెట్టానని, ప్రస్తుతం ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలిపాడు. కుమారుడు పుట్టకమునుపే ఈ పేరు పెట్టాలని ఆలోచించి పెట్టుకున్నానని ఆయన తెలిపారు.