డ్రోన్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబుతోపాటు పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు విజయవాడ కృష్ణానది ఒడ్డున బెర్మ్ పార్కు వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, 5 వేల డ్రోన్లతో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోతో పాటు లేజర్ షో తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఈ సదస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 400 మంది వక్తలు, ప్రతినిధులు పాల్గొంటారు. వెయ్యి మంది వివిధ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నిపుణులు వస్తారు. డ్రోన్ల తయారీ, వ్యవసాయ లాజిస్టిక్స్, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, ఆరోగ్యం తదితర రంగాల్లో డ్రోన్ల వినియోగంపై 9 చర్చా సెషన్లు ఉంటాయి. డ్రోన్ల సాంకేతికత వినియోగంపై కీలకమైన నాలుగు ప్రజెంటేషన్లు, ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ ఉంటాయి. వేదిక వద్ద దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీదారుల ఉత్పత్తులకు సంబంధించిన 40 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేశారు.