దేశంలో రాజకీయ హైడ్రామాలకు నెలవైన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత ఎన్నికల తర్వాత బీజేపీ కూటమి నుంచి విడిపోయి.. కాంగ్రెస్‌తో జట్టుకట్టిన ఉద్ధవ్ ఠాక్రే.. ప్రస్తుత ఎన్నికల వేళ మళ్లీ బీజేపీ కూటమి వైపు వస్తున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అయ్యారనే వార్తలు మరాఠా రాజకీయాలను మరోసారి వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల వేళ పాత మిత్రులు ఒక్కటవుతారనే వార్త ఇప్పుడు మహా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
సోమవారం కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా.. ముంబైలో పర్యటించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఉద్ధవ్ ఠాక్రే సమావేశం అయ్యారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది కానీ.. ఈ చర్చల్లో ఎలాంటి నిర్మాణాత్మక పురోగతి కనిపించలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య భేటీ గురించి వస్తున్న వార్తలను శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన సంజయ్ రౌత్ కొట్టిపారేశారు. వారిద్దరి మధ్య ఎలాంటి సమావేశం జరగలేదని తేల్చి చెప్పారు. అయితే గతంలో ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ ఏడాది జూన్‌లో మహరాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిసారి ఎదురుపడ్డారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఛాంబర్‌లో ఒకే లిఫ్ట్‌లో వెళ్లిన వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి పొత్తులు ఎటూ తేలడం లేదు అనే వార్తలు వస్తున్న వేళ.. ఈ ప్రచారం జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేయగా.. బీజేపీకి 105, శివసేన 56 స్థానాల్లో గెలుపొందాయి. అయితే ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీలతో పొత్తుపెట్టుకుని మహా వికాస్ ఆఘాఢీ కూటమి నేతృత్వంలో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2022 జూన్‌లో శివసేన నేత ఏక్‌నాథ్ షిండే.. కూటమిలో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టారు. ఆ తర్వాత శివసేన పార్టీని చీల్చి తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు.