బుల్డోజర్ల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి, ప్రమాదంలో పడతామంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అని వ్యాఖ్యానించింది. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో మత ఘర్షణల అనంతరం పలువురి నిర్మాణాల కూల్చివేతకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జసట్ిస్ కేవీ విశ్వనాథ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. బుధవారం దీనిపై విచారణ సాగిస్తామని, అప్పటివరకూ ఎటువంటి చర్యలు తీసుకోరాదని యోగి సర్కారును ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తూ.. అక్టోబరు 13 నాటి మత ఘర్షణల తర్వాత స్థానిక అధికారులు కూల్చివేత నోటీసులు జారీచేసి, మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని గడువు విధించారన్నారు. ‘ఓ పిటిషనర్ తండ్రి, సోదరులు లొంగిపోయిన తర్వాత నోటీసులు అక్టోబరు 17న జారీ చేసి, 18వ తేదీ సాయంత్రం అతికించారు.. మేము ఆదివారం విచారణను కోరాం.. కానీ అది జరగలేదు. కొందరు హైకోర్టును ఆశ్రయించారు’ అని పేర్కొన్నారు.
‘అంతకుముందు అలహాబాద్ హైకోర్టు కూల్చివేత నోటీసులకు సమాధానం ఇవ్వడానికి గడువును 15 రోజులకు పొడిగించింది.. ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించింది’ అని చెప్పారు. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్.. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
‘వారు (యూపీ అధికారులు) మా ఆదేశాలను ఉల్లంఘించి రిస్క్ తీసుకోవాలనుకుంటే, అది వారి ఇష్టం’ అని జస్టిస్ గవాయ్ పరోక్షంగా హెచ్చరించారు. కూల్చివేత నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు హైకోర్టు 15 రోజుల గడువు ఇచ్చిందని జస్టిస్ విశ్వనాథన్ తెలిపారు. అయితే పిటిషనర్లకు ఎలాంటి రక్షణ కల్పించలేదని సింగ్ వాదించారు.
ప్రస్తుత సుప్రీంకోర్టు ‘బుల్‌డోజర్ జస్టిస్’కి వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో మొదైలన ఈ ట్రెండ్‌ను ప్రస్తుతం బీజేపీ పాలన ఉన్న పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కూల్చివేతలకు నేరారోపణలు ఆధారం కాదని, పౌర నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రమే అటువంటి చర్య తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేతలను కూడా నిలిపివేసింది.