బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. బిష్ణోయ్ ముఠా సభ్యులు ముంబయి నగరంలో సిద్దిఖీని హత్య చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే.. రూ.కోటిపైగా క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది. ఈ మేరకు కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేసినట్లు నవభారత్ టైమ్స్ నివేదించింది.
‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్ చేసిన ఏ పోలీసు అధికారికైనా వారి భద్రత, కుటుంబ భవిష్యత్తు కోసం రూ.1.11 కోట్లకు పైగా ఇస్తాం... ఈ ముఠా ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి ప్రాణాలు తీసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని బీజేపీ ప్రభుత్వంపై రాజ్ షెకావత్ విమర్శలు గుప్పించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, గతేడాది డిసెంబర్ 5న రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ.. గుర్తుతెలియని వ్యక్తులు కాల్పుల్లో చనిపోయారు. తామే అతడ్ని హత్య చేసినట్టు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తర్వాత ప్రకటించింది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించి, నేర సామ్రాజ్యాన్ని నడుపుతోన్న లారెన్స్ బిష్ణోయ్.. మరో దావూద్ ఇబ్రహీంలా తయారయ్యాడు. రెండేళ్ల కిందట పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలాను ఈ ముఠాయే హత్య చేసింది. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసింది కూడా తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
అతడికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండటం వల్లే సిద్దిఖీని హత్యచేశామని పేర్కొంది. గతేడాది సెప్టెంబరులో హత్యకు గురైన ఖలీస్థానీ సానుభూతిపరుడు సుఖ్ దునేకేను తామే చంపినట్టు వెల్లడించింది. ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. బ్యారక్‌ల్లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీపై దాడులు ఈ విధంగానే చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. సిద్ధిఖీ హత్య తర్వాత నటుడు సల్మాన్ ఖాన్‌కు ఈ ముఠా పేరుతో బెదిరింపులు వచ్చాయి. ముంబయి పోలీసులకు వాట్సాప్ మెసేజ్ పంపి.. రూ.5 కోట్లు ఇవ్వాలని లేకుంటే సిద్దిఖీ కంటే దారుణంగా చంపుతామని బెదిరించారు. అయితే, మళ్లీ సోమవారం అదే నెంబరు నుంచి తాను తప్పుచేశాను, క్షమించాలని మెసేజ్ పంపడం గమనార్హం.