దేశ రాజధాని ఢిల్లీలో శీతకాలం రాకముందే వాయు కాలుష్యం భయపెడుతోంది. గత నాలుగైదు రోజులుగా గాలి నాణ్యత సూచి దారుణంగా క్షీణిస్తోంది. మంగళవారం ఉదయం మరింత దారుణంగా పడిపోవడంతో రెండో దశ ప్లాన్ అమల్లోకి వచ్చింది. వాయు నాణ్యత-వాతావరణ అంచనా పరిశోధన (SAFAR)డేటా ప్రకారం ఉదయం 8 గంటల సమయానికి వాయు నాణ్యత 317గా నమోదయ్యింది. దీనిని చాలా తీవ్రమైన కేటగిరీగా పరిగణిస్తారు. వాయు నాణ్యత 0- 50 మధ్య ఉంటే సంతృప్తికరమైందిగా.. 51 నుంచి 100 మధ్య ఉంటే స్వచ్ఛమైందిగా.. 101 నుంచి 200 మధ్య ఉంటే మోస్తరు.. 201 నుంచి 300 మధ్య ఉంటే ప్రమాదకరమైందిగా.. 400 నుంచి 450 మధ్య నమోదయితే అత్యంత ప్రమాదకరం.. 450 మించితే అత్యంత తీవ్రమైన పరిస్థితిగా పరిగణిస్తారు.
ఢిల్లీలో రాబోయే రోజుల్లో రోజువారీ సగటు గాలి నాణ్యత సూచి దారుణంగా ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులే అందుకు కారణమని పేర్కొంది. మంగళవారం నుంచి రెండో దశ ప్లాన్ అమల్లోకి రావడంతో ఢిల్లీ క్యాపిటిల్ ప్రాంతంలో బొగ్గు, వంట కలపతో పాటు డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు విధిస్తారు. గుర్తించిన కొన్ని రహదారులపై రోజూ స్వీపింగ్, నీటిని చిలకరిస్తారు. అలాగే, నిర్మాణ, కూల్చివేత ప్రదేశాలలో దుమ్ము నియంత్రణ చర్యలు కూడా అమలు చేయనున్నారు.
దీంతో పాటు రద్దీ ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను నియమించడం, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని నియంత్రించేందుకు పార్కింగ్ ఫీజు పెంచడం, మెట్రో, ఆర్టీసీ సహా ప్రజా రవాణాను అదనపు సర్వీసులు ప్రారంభిస్తారు. ప్రజా రవాణాను ఉపయోగించాలని, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. ఆటోమొబైల్స్‌లో సిఫార్సు చేసిన వ్యవధిలో ఎయిర్ ఫిల్టర్‌లను క్రమం తప్పకుండా మార్చాలని, అక్టోబర్ నుంచి జనవరి వరకు కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణ కార్యకలాపాలను నివారించాలని కూడా స్పష్టం చేశారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలుబెట్టరాదని ఆదేశించారు. అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన స్టేజ్-1 ప్లాన్‌కు ఇది అదనం. వాయు నాణ్యత 401 నుంచి 450 కి పడిపోతే స్టేజ్-3 అమల్లోకి తీసుకొచ్చి, వాయు కాలుష్యానికి కారణమయ్యే మరిన్ని కార్యకలాపాలపై ఆంక్షలు విధించనున్నారు.
వాతావరణంలో సూక్ష్మ పరిమాణంలో ఉండే పీఎం 2.5 (పార్టికులేట్ మ్యాటర్) కాలుష్య కణాలు నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. దీనికి తోడు వాతావరణంలోకి విడుదలయ్యే ఇతర కర్బన ఉద్గారాల ప్రభావం ఢిల్లీపై తీవ్రంగా పడుతోంది. ఈ కారణాల వల్ల ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఢిల్లీ మారిపోయింది. శీతాకాలంలో తక్కువ వేగంతో గాలులు వీయడంతో కాలుష్య కణాలను దిగువ వాతావరణ పొరల్లో నిలిచేలా చేస్తయి. దీని వల్ల కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి దిగజారుతుంది.