సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. నవంబర్ 10వ తేదీ నాటికి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం ముగియనుండగా.. ఆ స్థానంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు అయ్యారు. తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ఇప్పటికే సిఫార్సు చేయగా.. ఆ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం అధికారికంగా జరిగినట్లు అయింది.
ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత నవంబర్ 11వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తాజాగా వెల్లడించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13వ తేదీ వరకు సీజేఐగా కొనసాగనున్నారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. 2019 జనవరి 18వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14వ తేదీన పుట్టారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు.
ఢిల్లీలోని తీస్‌హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. దేశంలోని ఏ హైకోర్టుకూ చీఫ్ జస్టిస్‌గా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమందిలో ఒకరిగా జస్టిస్ ఖన్నా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు ఆయన మేనల్లుడు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు. అంతేకాకుండా భోపాల్‌లోని నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ కొనసాగుతున్నారు.
న్యాయ కోవిదుడిగా పేరుగాంచిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్ ఓటింగ్‌లకు చెక్ పెడతాయని స్పష్టం చేయడమే కాకుండా ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను 100 శాతం వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టేసిన ధర్మాసనానికి ఆయనే సారథిగా ఉన్నారు. ఇక ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా జస్టిస్ ఖన్నా ఉన్నారు.