జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో మరింత రెచ్చిపోతున్నారు. గత నాలుగు రోజుల్లో 3 భారీ ఉగ్రదాడులు జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో సైనిక వాహనాలపైనే రెండుసార్లు దాడులు జరగడం సంచలనం రేపుతోంది. తాజాగా బారాముల్లా జిల్లాలో వెళ్తున్న సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఉగ్రవాదులు దాడులు చేశారు. దీంతో అలర్ట్ అయిన జవాన్లు.. వారిపైకి ఎదురుకాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులు అయ్యారు. అదే సమయంలో మరో ఇద్దరు కార్మికులు కూడా చనిపోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ వద్ద బోటపత్రి ప్రాంతం వద్ద మొదట గురువారం సాయంత్రం.. ఆర్మీ వెహికల్‌పై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే సైన్యం స్పందించి ఎదురుకాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే రెండువైపులా భీకరమైన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సైనికులు అమరులు అయ్యారు. మరో ఐదుగురు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఇక ఇద్దరు వలస కార్మికులు కూడా ఈ ఉగ్రవాద కాల్పుల్లో చనిపోయారు. దీంతో సంఘటనా స్థలానికి భద్రతా బలగాలు భారీగా చేరుకుని ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
18వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వాహనం బుటపత్రి నుంచి బయల్దేరగా నాగిన్ ధోక్ ఒక్కసారిగా ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారు. సాధారణంగా గుల్మార్గ్, బోటపత్రి ప్రాంతాల్లో పర్యావరణ ప్రేమికులు, పర్యాటకులతో నిండి ఉంటుంది. పైగా ఈ ప్రాంతంలో సైన్యం తక్కువగా ఉండగా.. అలాంటి ప్రాంతంలో ఈ ఉగ్రదాడి చోటు చేసుకోవడం గమనార్హం. గతవారం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్ లోయలో ఉగ్రదాడులు పెరిగిపోవడం ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతోంది.
గత నాలుగు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన మూడో అతిపెద్ద దాడి ఇది కావడం సంచలనంగా మారింది. అక్టోబర్ 20వ తేదీన గందర్‌బాల్‌లో టన్నెల్ నిర్మాణ కార్మికుల హౌసింగ్ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడిలో ఒక డాక్టర్ సహా ఏడుగురు కార్మికులు చనిపోయారు. గురువారం ఉదయం పుల్వామా జిల్లాలోని బటాగుండ్ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన ఆ కార్మికుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుభం కుమార్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.