యాపిల్ కంపెనీ కొన్ని రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 16 మోడల్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఐఫోన్ 16 ధరలు వివిధ దేశాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఐఫోన్ 16ను కొనుగోలు చేసేందుకు చాలామంది యాపిల్ లవర్స్ ఎంతో వేచి చూశారు. మరికొందరు కొనేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం ఈ ఐఫోన్ 16పై తాజాగా నిషేధం విధించడం పెను సంచలనంగా మారింది. స్థానికంగానే కాకుండా ఇతర దేశాల్లో కొనుగోలు చేసి.. తమ దేశంలో వాడటానికి కూడా అనుమతించేది లేదని ఇండోనేషియా సర్కార్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇండోనేషియా వెళ్లాలనుకునే ఇతర దేశాల పర్యాటకులు ఆలోచిస్తున్నారు.
యాపిల్ లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 16పై నిషేధం విధించిన ఇండోనేషియా.. తమ దేశంలో అమ్మకాలు, వాడకంపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో కొని ఇండోనేషియాలో వాడడంపైనా నిషేధం విధించింది. ఇండోనేషియలో ఐఫోన్ 16 వాడడంపై నిషేధం విధిస్తున్నట్లు అక్కడి పరిశ్రమల శాఖ మంత్రి గుమివాంగ్ కర్తసస్మిత తాజాగా ప్రకటించారు. ఇండోనేషియాలో ఐఫోన్ 16 వాడడానికి ఐఎంఈఐ సర్టిఫికేషన్ లేదని.. అందుకే ఆ ఫోన్‌పై నిషేధం విధించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఐఫోన్ 16ను ఉపయోగిస్తే.. అది తమ చట్టాల ప్రకారం నేరమే అవుతుందని తేల్చి చెప్పారు. ఎవరైనా అక్రమంగా ఐఫోన్ 16ను వాడినట్లు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఉంటే తెలియజేయాలని ఇండోనేషియా ప్రజలకు గుమివాంగ్ కర్తసస్మిత విజ్ఞప్తి చేశారు.
అయితే యాపిల్ ఐఫోన్ 16లపై ఇండోనేషియా ఆంక్షలు విధించడానికి ఒక బలమైన కారణం ఉంది. యాపిల్ కంపెనీ ఇండోనేషియాలో పెట్టుబడి పెడతామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అయిందని.. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 1.71 మిలియన్ ఇండోనేషియా రూపాయలు అంటే మన భారత కరెన్సీలో రూ.900 కోట్లకు పైగా పెట్టుబడి పెడతామని యాపిల్ హామీ ఇచ్చిందని.. అయితే 1.48 మిలియన్ ఇండోనేషియా రూపాయలు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.800 కోట్లను మాత్రమే పెట్టుబడి పెట్టిందని స్థానిక మీడియా వెల్లడించింది.
అయితే పెట్టుబడులకు సంబంధించి ఇండోనేషియాకు చెప్పిన యాపిల్ కంపెనీ.. అంతకన్నా తక్కువ పెట్టుబడులు పెట్టడంతోనే ఐఫోన్ 16పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండోనేషియా మంత్రి గుమివాంగ్ కర్తసస్మిత తెలిపారు. ఇండోనేషియాలో ఏదైనా వస్తువును విక్రయించాలంటే 40 శాతం స్థానికంగా తయారు చేయాలన్న రూల్ ఉందని.. దాన్ని చేరుకోవడంలో యాపిల్ కంపెనీ విఫలం కావడంతోనే ఈ పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ ఐఫోన్ 16ను ఇష్టంతో, ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన ఇండోనేషియా వాసులు ఈ నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. ఇక ఐఫోన్ 16కలిగిన టూరిస్ట్‌లు ఇప్పుడు ఇండోనేషియా వెళ్లడంపై ఆలోచలనలో పడ్డారు.