మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌లో ఫుడ్ ఫాయిజన్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పది మందికిపైగా అస్వస్థతకు గురయిన ఘటన అమెరికాలోని కొలరాడోలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. వారు తిన్న ఆహార పదార్థాల్లోని ఈ.కొలి బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం బారినపడినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేఎఫ్‌సీ మాతృ సంస్థ యమ్ బ్రాండ్స్, బర్గర్ కింగ్‌లు ఉల్లిపాయల వాడకంపై కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని తమ సంస్థకు చెందిన టాకో బెల్, పిజా హట్, కేఎఫ్‌సీ ఔట్‌లెట్స్‌లో ఉల్లిపాయలు వినియోగించరాదని యమ్ సంస్థ గురువారం ప్రకటించినట్టు బ్లూంబర్గ్ న్యూస్ నివేదించింది. అయితే, ఏ ప్రాంతం, ఏ ఔట్‌లెట్స్ అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.
‘మేము అందజేసే ఆహార ఉత్పత్తుల్లో భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి నియంత్రణ మార్గదర్శకాలను అనుసరిస్తాం’ అని ఆ సంస్థ పేర్కొంది. మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లకు టేలర్ ఫార్మ్స్ సరఫరా చేసిన ఉల్లిపాయలల్లో ఈ.కొలి వ్యాప్తి చెందినట్టు బర్గర్ కింగ్ గురువారం వెల్లడించింది. బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించనప్పటికీ టేలర్ ఫార్మ్స్ తాము సరఫరా చేసిన కొన్ని ఉల్లి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. అమెరికా ఫుడ్ హోల్డింగ్ కార్పొరేషన్, సైస్కో కార్పొరేషన్‌లు కూడా ఇదే విధంగా ఉల్లిపాయలను రీకాల్ చేశాయి.
‘అధికారులు ఎటువంటి ఆదేశాలు, అనారోగ్య సూచనలు చేయనపపటికీ రెండు రోజుల కిందట సరఫరా అయిన ఉల్లిపాయలను వాడొద్దని 5 శఆతం రెస్టారెంట్‌లకు కోరాం’ బర్గర్ కింగ్ పేర్కొంది. జానీ రాకెట్స్ రెస్టారెంట్స్ సహా ఫ్యాట్ బ్రాడ్స్ ఇంక్ సైతం టేలర్ ఫార్మ్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలను వాడొద్దని సూచించింది. కొలరాడో ఘటనతో అమెరికాలోని రెస్టారెంట్లు పచ్చి ఉల్లిపాయ ముక్కలను కస్టమర్లకు అందజేయరాదని నిర్ణయానికి వచ్చాయి. మెక్‌డొనాల్డ్స్ అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ రెస్టారెంట్లలోని 20 శాతం వాటిలో ఉల్లిపాయల వినియోగం నిషేధించింది. మనిషి ప్రాణం తీసే బ్యాక్టీరియా ఉందనే భయంతో ఈ ఏడాది జనవరిలో అమెరికాలో మాంసం విక్రయాలు జరిపే ఓ సంస్థ వేలాది కిలోల మాంసాన్ని మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. ఈ.కొలి అంటే ‘ఎచేరిచియా కొలి’ అని అర్ధం. ఇది మనుషులు, జంతువుల ఉదరంలో పేగుల్లో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా.