పాకిస్థాన్ గడ్డపై మరో కొత్త ఉగ్రవాద సంస్థ పురుడుపోసుకుంది. లష్కరే తొయిబా, హజ్బుల్ ముజాయిద్దీన్, జైషే మహమ్మూద్ సంయుక్తంగా ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. గతంలో అల్-ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ బిన్ లాడెన్ స్థావరమైన అబోటాబాద్‌లోనే ఉగ్రవాద శిబిరాన్ని నెలకొల్పాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఆర్మీ స్థావరానికి సమీపంలోనే దీనిని నడుపుతున్నట్టు తెలిపాయి. ఆర్మీ అనుమతి లేకుండా ఇతరులు ఈ ప్రదేశంలోకి వెళ్లే అవకాశం లేనందున వారికి చాలా సురక్షితమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఆయుధాల వినియోగం సహా పలు అంశాలలో యువకులు, మహిళలకు శిక్షణ ఇచ్చే ఈ క్యాంప్ పర్యవేక్షణ బాధ్యతలు పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌కు చెందిన ఓ జనరల్‌కు అప్పగించారని తెలిపాయి. అబోటోబాద్ స్థావరంలో దాక్కుకున్న అల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా సైన్యాలు వేటాడి మే 2011లో మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాన్ని 2012లో పాకిస్తాన్ కూల్చివేసింది. మళ్లీ అదే స్థావరంలో ఈ ఉగ్రవాద శిబిరం ఏర్పాటుచేశారా? అనేది స్పష్టత లేదని నిఘా వర్గాలు వ్యాఖ్యానించాయి.
అయితే, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్, జైషే మహమ్మూద్ ఉగ్రవాద సంస్థల అధినేతలు హఫీజ్ సయీద్, సయ్యద్ సలాహుద్దీన్, మసూద్ అజార్‌లు కలిసి భారీస్థాయిలో ఉగ్రశిక్ష కేంద్రాన్ని నడుపుతున్నారని చెప్పాయి. ఈ ముగ్గురూ నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మోస్ట్-వాంటెడ్ ఉగ్రవాదులు జాబితాలో ఉన్న విషయం తెలిసిందే. కొత్త శిబిరం మూడు సంస్థలకు రిక్రూట్‌మెంట్ కేంద్రంగా ఉంది.
బారాముల్లా జిల్లాలో ఆర్మీ వాహనంపై గురువారం రాత్రి దాడితో సహా గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాద దాడుల జరుగుతోన్న తరుణంలో కొత్త ఉగ్రవాద శిక్షణా కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. గురవారం నాటి ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. దీనికి మూడు రోజుల ముందు సోన్ మార్గ్ సొరంగం వద్ద నిర్మాణ కార్మికుల క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ వైద్యుడు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల నెలల్లో పౌరులపై జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడి ఇదే. ఇక, పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లో రెండు ఉగ్రదాడులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.