హమాస్-ఇజ్రాయేల్ యుద్దం ముగింపు కోసం చేస్తోన్న ప్రయత్నాల్లో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో జరిగిన శాంతి చర్చలకు ఇజ్రాయేల్ గూఢచారి సంస్థ అధినేత, హమాస్ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయేల్ ముందు హమాస్ కీలక ప్రతిపాదన పెట్టింది. గాజాలో దాడులు నిలిపివేసి.. ఇజ్రాయేల్ వెనక్కి వెళ్తే తమ పోరాటం ఆపేస్తామని ప్రతిపాదించారు. గతంలో కాల్పుల విరమణపై అమెరికా, ఫ్రాన్స్ చేసిన విజ్ఞప్తిని ఇజ్రాయేల్ తిరస్కరించిన విషయం తెలిసిందే. గతవారం హమాస్ అధినేత యహ్వా సిన్వార్‌ను ఇజ్రాయేల్ హతమార్చడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న తరుణంలో మరోసారి శాంతి ప్రక్రియకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
హమాస్ సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ.. కైరో గురువారం ఈజిప్టు అధికారులతో గాజా సంధికి సంబంధించిన ప్రతిపాదనలు, ఆలోచనలను తమ ప్రతినిధి బృందం పంచుకుందన్నారు. ‘హమాస్ పోరాటాన్ని ఆపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.. అయితే ఇజ్రాయేల్ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి.. గాజా స్ట్రిప్ నుంచి తన సైన్యాలను ఉపసంహరించుకోవాలి.. గాజాను వీడిన ప్రజలను తిరిగి రావడానికి అనుమతించాలి.. ఖైదీల మార్పిడి ఒప్పందానికి అంగీకరించాలి.. గాజాలోకి మానవతా సహాయాన్ని అనుమతించాలి’ అని పేర్కొన్నారు.
అటు, ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైతం ఈజిప్టు ప్రయత్నాలను స్వాగతించారు. హమాస్ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. కైరోలో సమావేశం ముగిసిన తర్వాత.. చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తోన్న కీలక దేశం దోహాకు వెళ్లాలని గూఢచారి సంస్థ మొస్సాద్ అధిపతిని నెతన్యాహు ఆదేశించినట్టు ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
అంతకు ముందు, గాజాలో కాల్పుల విరమణపై చర్చలు దోహా వేదికగా పునఃప్రారంభమవుతాయని అమెరికా, ఖతార్ ప్రకటించాయి. ఖతార్ నాయకత్వంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ సమావేశమయ్యారు. గాజాపై యుద్దం మొదలైన తర్వాత బ్లింకేన్ 11వ సారి అక్కడ పర్యటించడం గమనార్హం. ఇజ్రాయేల్ దళాలను ఉపసంహరించుకునేలా, పాలస్తీనా ప్రజలు తమ జీవితాలు, భవిష్యత్తును పునర్నిర్మించుకునేలా ఒక ప్రణాళికను కోరుతున్నారని ఆయన అన్నారు.
మరోవైపు, ఈ నెలలో ఉత్తర గాజాలో హమాస్ లక్ష్యంగా ఇజ్రాయేల్ ప్రారంభించిన ఆపరేషన్‌లో ఇప్పటి వరకూ 770 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అధికార ప్రతినిధి మహమూద్ బసల్ తెలిపారు. శిథిలాలా కింద అనేక మంది చిక్కుకుపోవడంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వేలాది మంది ప్రజలు యుద్ధ భూమిలో చిక్కుకున్నారని బసల్ పేర్కొన్నారు. గురువారం సెంట్రల్ గాజాలోని ఓ పాఠశాలపై ఇజ్రాయేల్ దాడుల్లో 17 మంది మృతిచెందారు.