లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్. స్వామివారిని దర్శించుకోవడానికి శబరిమలకు వెళ్లే భక్తులు ఇకపై విమానాల్లో కొబ్బరికాయలను తమ వెంటే తీసుకెళ్లే వెసలుబాటు లభించింది.ఈ మేరకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతులను మంజూరు చేసింది.వచ్చే ఏడాది జనవరి 20వ వరకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత దీన్ని రద్దు చేస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం విమానాల్లో ప్రయాణికులు ఎవ్వరు కూడా తమ వెంట కొబ్బరికాయలను తీసుకెళ్లే వెసలుబాటు లేదు.ఫలితంగా- అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులు తమవెంట కొబ్బరికాయ, ఇరుముడిని తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. విమానాల్లో ఇరుముడిని తీసుకెళ్లే అవకాశం లేకపోవడం వల్ల రోడ్డు లేదా రైలు మార్గంలో శబరిమలకు వెళ్తోండటం ఆనవాయితీగా వస్తోంది.
అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటోన్న సమస్యలపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కూర్ దేవస్వం బోర్డు అధికారులు పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపారు. వారికి వినతిపత్రాన్ని అందించారు. దీనిపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సానుకూలంగా స్పందించింది. తాత్కాలిక సడలింపులు ఇచ్చింది.ఎక్స్-రే, ఎక్స్‌ప్లోజివ్ ట్రేస్ డిటెక్టర్, ఇతర పరీక్షల తర్వాత మాత్రమే కొబ్బరికాయలను విమానంలో తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. కొబ్బరికాయలను వేగంగా మండే స్వభావం ఉన్న వస్తువుగా పరిగణించడం వల్ల దీన్ని విమానంలో తీసుకెళ్లడానికి అనుమతులు లేవు.ఇందులో ఉండే నూనె మంటలు వ్యాప్తి చెందడానికి కారణమౌతాయనే ఉద్దేశంతో దీన్ని నిషేధించింది. అదే సమయంలో ఇరుముడిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయ, భక్తులు వివిధ పుణ్యక్షేత్రాల వద్ద సమర్పించుకోవడానికి సాధారణ టెంకాయలను కూడా తమవెంట తీసుకెళ్తుంటారు. వాటిని విమానంలో తీసుకెళ్లడానికి నిబంధనలు అంగీకరించవు.
అయ్యప్ప స్వామి భక్తుల ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ తాత్కాలికంగా ఈ నిబంధనలను సడలించింది. మకరవిళక్కు- పండళం పూజ ముగిసేంత వరకు అంటే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ వరకు ఈ సడలింపు అమలులో ఉంటుంది.