ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు టీడీపీ కూటమి ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త వినిపించనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం ఇప్పటికే మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం.. త్వరలోనే టీచర్ పోస్టులు భర్తీ చేయనుంది. అయితే ఏపీఎస్ ఆర్టీసీలోని ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు ప్రభుత్వం నుంచి కసరత్తు కూడా ప్రారంభమైంది. ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఖాళీల వివరాలను ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఈ వివరాలను ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది.
మరోవైపు మొత్తం 18 విభాగాల్లో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఖాళీలను గుర్తించారు.18 కేటగిరీల్లో మొత్తం 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్టీసీ తెలిపింది. ఇందులో 3,673 రెగ్యులర్ డ్రైవర్ ఖాళీలు, 1,813 కండక్టర్ పోస్టులు, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 207 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఖాళీల వివరాలను ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా ఖాళీల భర్తీపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనుంది.
మరోవైపు ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న వివరాలను ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించింది. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్, మెషినిస్ట్, వెల్డర్ ట్రేడుల్లో జిల్లాల వారీగా ఖాళీలు ఉన్నాయి. ఇక ఇందుకోసం ఐటీఐ పూర్తిచేసినవారు అర్హులు. అక్టోబర్ 31 వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలించిన తర్వాత అప్రెంటీస్‌లుగా తీసుకుంటారు. మరిన్ని వివరాలను ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని అధికారులు సూచించారు. ఈ నెలాఖరు వరకూ అవకాశం ఉందని.. ఉపయోగించుకోవాలని సూచించారు.