ఎన్టీఆర్, జాన్వీకపూర్ జంటగా నటించిన దేవర సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత హంగామా సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఛార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. సినిమా విడుదలైన తర్వాత కలెక్షన్ల వర్షం కురిపిస్తే.. అంతకు ముందు విడుదలైన పాటలు సోషల్ మీడియాలో ఓ రేంజులో దుమ్మురేపాయి. చుట్టమల్లే పాటతో పాటుగా దావూదీ పాటకు ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ అందరూ చిందేసిన వారే. అయితే దావూదీ పాటకు ఓ ఆర్టీసీ డ్రైవర్ వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజనం భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆయన టాలెంట్‌ను మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం బస్సు కోసం ఎదురుచూసే ప్రయాణికుల పరిస్థితి ఏంటో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లా తునిలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులోకి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో బస్సులో సమస్య తలెత్తింది. దీంతో మార్గమధ్యంలో బస్సు ఆగిపోయింది. ఎంతకూ స్టార్ట్ కాలేదు. దీంతో ఇక చేసేదేమీ లేక.. ప్రయాణికులు అందరూ ఉసూరంటూ కిందకు దిగారు. అయితే బస్సు ఆగిపోతే.. బస్సు డ్రైవర్‌లోని కళాకారుడు మాత్రం బయటకు వచ్చాడు. బస్సులోని ప్యాసింజర్లకు బోర్ కొట్టకుండా చూడాలని అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. తనలోని మైకేల్ జాక్సన్‌ను బయటపెట్టాడు. దేవరలోని దావూదీ పాటకు డ్రైవర్ మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించాడు. అయితే డ్రైవర్ డ్యాన్స్ పెర్ఫా్మెన్స్‌ను అక్కడే ఉన్న ఎవరో కెమెరాలో బంధించారు.
ఆగిపోయిన బస్సు ముందు ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజనం కూడా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. డ్రైవర్ గారి డ్యాన్స్ పెర్ఫామెన్స్ సూపర్ అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే.. మరికొంత మంది మాత్రం ఆ బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్యాసింజర్ల పరిస్థితి ఏమిటో అని కామెంట్లు పెడుతున్నారు. అయితే బస్సు ఎందుకు ఆగిందనే దానిపై వివరాలు క్లారిటీగా లేవు కానీ.. డ్రైవరన్నయ్య డ్యాన్స్ ప్రదర్శన మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.