ప్రపంచంలోనే అతి పెద్ద భవనాన్ని సౌదీ అరేబియాలో నిర్మిస్తున్నారు. దీనికి ది ముకాబ్ అని పేరు కూడా పెట్టారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రూపుదిద్దుకుంటున్న కొత్త నగరమైన న్యూ మురబ్బాలో ఈ భవన నిర్మాణం ప్రారంభం అయింది. సౌదీ విజన్ 2030లో భాగంగా భారీ ఖర్చుతో ఈ ది ముకాబ్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 400 మీటర్ల ఎత్తు, వెడల్పుతో.. క్యూబ్ ఆకారంలో ఈ ది ముకాబ్ నిర్మాణం ఉండనుంది. 20 లక్షల మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్ స్పేస్‌తో ఈ భారీ భవనం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటైన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌తో పోల్చితే ఈ బిల్డింగ్ 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి.
ఈ ది ముకాబ్ నిర్మాణానికి ఏకంగా 50 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4.20 లక్షల కోట్లను వెచ్చించనున్నారు. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ సంస్థ అయిన పబ్లిక్ ఇన్‌వెస్ట్‌మెంట్ ఫండ్- పీఐఎఫ్‌లో భాగంగా ఉన్న న్యూ మురబ్బా డెవెలప్‌మెంట్ కంపెనీ-ఎన్‌ఎండీసీ ది ముకాబ్‌ను నిర్మిస్తోంది. ఈ భవనం విస్తీర్ణం 20 లక్షల మిలియన్ చదరపు మీటర్లు ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద భవనాల్లో ఒకటైన న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లు.. ఇందులో 20 భవనాలు పడతాయని సమాచారం. ఇక ఈ భవనంలో 104000 గృహాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచంలోనే ఎత్తైన ఆకాశహర్మ్యంగా ఉండాలని భావించిన జెడ్డా టవర్‌తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గతంలోనే సౌదీ అరేబియా చేపట్టింది. కానీ ఈ ప్రాజెక్టులను పలు కారణాలతో 2018లోనే నిలిపివేశారు.
ఇక ఈ ది ముకాబ్ బిల్డింగ్‌ను సంప్రదాయ నాజ్ది నిర్మాణశైలికి.. ప్రస్తుత టెక్నాలజీని జోడించి నిర్మిస్తున్నారు. ఈ భవనం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ఆకాశహర్మ్యం లోపలి గోడలకు అధునాతన వర్చువల్ రియాలిటీతో పాటు భారీ హోలోగ్రామ్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల లోపలికి అడుగుపెట్టగానే భూమిపైనే ఉన్నామా లేక మరో ప్రపంచంలో తేలియాడుతున్నామా అనే అనుభూతిని కల్పిస్తుందని సౌదీ అరేబియా వర్గాలు వెల్లడించాయి.
ఇక ది ముకాబ్‌లో అన్నిరకాల సదుపాయాలు ఉంటాయని పేర్కొంటున్నారు. నివాసాలు, హోటళ్లు, షాపింగ్ మాల్‌లు, ఆఫీస్‌లు, థియేటర్లు, మ్యూజియంలు.. ఇలా ఒక పెద్ద నగరంలో ఉండే అన్ని సదుపాయాలు, నిర్మాణాలు ఈ ఒక్క భవనంలోనే ఒకే దగ్గర ఉంటాయని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస సదుపాయాలు ఇందులో ఉంటాయని పీఐఎఫ్ చెబుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడకుండా.. వివిధ రంగాల వైపు మళ్లించే లక్ష్యంతోనే సౌదీ అరేబియా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఈ ది ముకాబ్ ముఖ్యమైందని పేర్కొంటున్నారు. 2030 నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని పీఐఎఫ్ వెల్లడించింది.