అధికార కూటమిలోని మూడు పార్టీల నెల్లూరు జిల్లాస్థాయి నేతల సంయుక్త సమావేశం ఈనెల 30న ఒంగోలులో ఏర్పాటు చేశారు. స్థానిక భాగ్యనగర్‌లోని టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇది జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్త సమావేశాలను కొనసాగించాలని ఆ పార్టీల అధిష్ఠానాలు నిర్ణయించాయి. రాష్ట్రస్థాయిలో అలాంటి సమావేశాలు జరుగుతుండగా జిల్లా స్థాయిల్లో కూడా నిర్వహించి ప్రభుత్వ పథకాల అమలు, ఇతరత్రా అంశాలలో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నిశ్చయించుకున్నాయి.
ఇన్‌చార్జి మంత్రుల నియామకాలు చేపట్టిన అనంతరం వారి ఆధ్వర్యంలో ఈ సమావేశాలను ఇప్పటికే పలు జిల్లాల్లో నిర్వహించారు. అందులో భాగంగా ఈనెల 30న ఒంగోలులో సమావేశం ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎ్‌సబీవీ స్వామి టీడీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీల నుంచి ఆ పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇద్దరు ముగ్గురు ముఖ్యనేతలు పాల్గొంటారని సమాచారం. సమావేశం ఏర్పాటుపై మంత్రి డాక్టర్ స్వామితో ఆదివారం సాయంత్రం ఇన్‌చార్జి మంత్రి రామనారాయణరెడ్డి మాట్లాడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై జిల్లాస్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం వచ్చేనెల 4న యధావిధిగా జరగనుంది.