పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవల్‌పమెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్‌తో డల్లా్‌సలో లోకేశ్ భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డేటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో భిన్నమైన పోర్ట్‌పోలియోలను పెరోట్ నిర్వహిస్తున్నారు. పబ్లిక్ ప్రైవేటు ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఏవియేషన్స్ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపాయి. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్, పబ్లిక్-ప్రైవేటు ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పెరోట్‌ను లోకేశ్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాజెక్టులు టెక్సాస్ తరహాలోనే ఏపీలోనూ ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పన రంగంలో పెట్టుబడులకు అనువైన వాతారణం ఉందని, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించాలని కోరారు. విశాఖలో ఏవియేషన్ వర్సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఏరోస్పేస్ టెక్నాలజీలో ఏపీ ఆకాంక్షలు నెరవేర్చడం, ఏవియేషన్ హబ్ ఏర్పాటులో సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలన్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టమ్ ఉందన్నారు. హైవేలు, పోర్టులు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పరిశీలించాలని పెరోట్‌ను లోకేశ్ కోరారు.