సీతంపేటలోని గిరిజన మ్యూజియంలో చోరీ జరిగింది. సెంట్రల్ ఏసీ యూనిట్, లైట్లు, సీలింగ్‌ను ధ్వంసం చేశారు. అయితే ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. భవనం చుట్టూ ఉన్న 14 ఏసీ ఔటర్ యూనిట్లు, మరో 3 సీలింగ్ లైట్లు కనిపించడం లేదని మ్యూజియం క్యూరేటర్ సుశీల సోమవారం తెలిపారు. అంతేగాకుండా మరికొన్ని వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించామని, ఎలక్ర్టికల్ వస్తువులకు సంబంధించి ఇంకా ఏవేవి పోయాయో గుర్తించాల్సి ఉందని చెప్పారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. దీనిపై ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబును వివరణ కోరగా.. గిరిజన మ్యూజియమంలో విలువైన వస్తువులు పోయినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా పోలీస్ సిబ్బంది గిరిజన మ్యూజియాన్ని సందర్శించి చోరికి గురైన వస్తువులు వివరాలను సేకరించారు.