దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం మరింత కమ్మేసింది. దీపావళి వేడుకల్లో కాల్చిన బాణాసంచాతో గాలిలో నాణ్యత మరింత దిగజారింది. శుక్రవారం ఉదయం అన్ని ప్రాంతాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయిని మించిపోయింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు, కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నగరవాసులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చడమే దీనికి కారణం. ఢిల్లీ నగరం మొత్తాన్ని గాలి కాలుష్యం దుప్పటిలా కప్పేసింది. గాలి అత్యంత విషతుల్యంగా మారిపోగా.. దీనిని పీల్చితే అనారోగ్యం బారినపడటం ఖాయం. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 360 దాటేసింది.
సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫొర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (సఫర్) డేటా ప్రకారం.. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు వాయు నాణ్యత సూచీ సగటు 359గా నమోదయ్యింది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. నగరంలోని మొత్తం నమోదు కేంద్రాలకు గానూ.. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఆనంద్ విహార్, ఆర్కే పురంలో అత్యధికంగా 395గా ఉంది. తర్వాత బురారీ క్రాసింగ్ (394),సోనియా విహార్ (392), పంజాబీ బాగ్ (391), నార్త్ క్యాంపస్ (390), బవానా (388), జహంగీర్‌పూర్ (387), రోహిణి (385), అశోక్ విహార్ (384), నెహ్రూ నగర్ (381)లో కాలుష్యం తీవ్రత ప్రమాదకర స్థాయికి దాటేసింది. శుక్రవారం ఈ స్థాయిలోనే ఉంటుందని పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియాలజీ ముందే అంచనా వేసింది.
కాగా, దీపావళి సందర్భంగా బాణాసంచాపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో నగరవ్యాప్తంగా పర్యవేక్షణకు 377 టీమ్‌లను నియమించినట్టు ఢిల్లీ వాతావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. అన్ని కమిషనరేట్ల పరిధిలోనూ టపాసులను కాల్చకుండా అడ్డుకోవాలని డీసీపీలకు ఆదేశాలు ఇచ్చినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది దీపావళి మర్నాడు ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. నవంబరు 12న దీపావళి జరుపుకోగా.. ఆ మర్నాడు ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 218గా నమోదయ్యింది. ఎనిమిదేళ్ల తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదుకావడం అదే మొదటిసారి.
ఢిల్లీలో వాహనాలు, పరిశ్రమలతో పాటు సమీపంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టడం కాలుష్యం పెరగడానికి దోహదం చేస్తున్నాయి. అక్టోబరు నవంబరు నెలలో పంటల కోత పూర్తయిన తర్వాత రైతులు వాటిని తగలుబెట్టడం వల్ల దట్టమైన పొగలు ఢిల్లీకి కమ్మేస్తుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు, గాలి వేగం తగ్గడంతో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గడచిన రెండు వారాలుగా ఢిల్లీలో కాలుష్యం పెరుగుదల ఆందోళనకు గురిచేస్తోంది. నియంత్రణకు ఇప్పటికే గ్రేడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమల్లోకి వచ్చాయి.