ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గగన్‌యాన్‌కు ముందు ఇస్రో అనలాగ్ మిషన్.. లడఖ్‌లో ప్రారంభం, విశేషాలేంటంటే?

national |  Suryaa Desk  | Published : Fri, Nov 01, 2024, 09:33 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. మరిన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన టెక్నాలజీలను పరీక్షించేందుకు మరిన్ని ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను పంపించేందుకు త్వరలోనే గగన్‌యాన్ ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో.. ఆ తర్వాత మరిన్ని కీలక ప్రయోగాలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వాటన్నింటికీ సంబంధించి పలు రకాల టెక్నాలజీలను టెస్ట్ చేసేందుకు మరో కీలక ప్రాజెక్టును ప్రారంభించింది. గగన్‌యాన్‌ సహా ఇతర స్పేస్‌ ప్రాజెక్టుల కోసం లడఖ్‌లో ఓ ప్రత్యేకమైన ప్రాజెక్టును మొదలుపెట్టింది. అనలాగ్‌ మిషన్‌ పేరుతో వివిధ టెక్నాలజీలను లడఖ్‌లో ఇస్రో పరీక్షించనుంది.


స్పేస్ మిషన్లు చేపట్టే సంస్థలు, స్పేస్‌ ఏజెన్సీలు.. మొదటగా అత్యంత కీలకమైన అనలాగ్‌ మిషన్లను చేపడతాయి. ఆ తర్వాతే వాటికి భిన్నమైన వాతావరణం, భౌగోళిక ప్రదేశాలు.. ఆ ప్రాజెక్టులో భాగమైన వ్యోమగాములకు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే భారత్‌ గగన్‌యాన్‌ ప్రాజెక్టును చేపట్టనుండగా.. తన కీలకమైన అనలాగ్‌ మిషన్‌కు లడఖ్‌లోని లేహ్‌ను ప్రయోగాలకు వేదికగా ఎంచుకుంది.


అయితే అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రను చేపట్టేందుకు సంబంధించి చేసే ఫీల్డ్‌ టెస్టులనే అనలాగ్‌ మిషన్‌లు అంటారు. ఇందులో ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసి.. అంతరిక్ష యాత్రకు సంబంధించిన సన్నద్ధతను విశ్లేషణలు చేస్తాయి. సాధారణంగా కొత్త టెక్నాలజీలు, రోబోటిక్‌ పరికరాలు, ప్రత్యేకమైన వెహికల్స్, కమ్యూనికేషన్లు, విద్యుత్ తయారీ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రయోగాలను ఇందులో చేస్తారని నాసా వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అంతరిక్షంలో రేడియేషన్‌ అంచనా వేయడం ఈ ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన భాగం. సాధారణంగా భూమిపై ఉండే అయస్కాంత క్షేత్రాలు, వాతావరణం వంటివి విశ్వం నుంచి వచ్చే రేడియేషన్‌ను తగ్గిస్తాయి. కానీ అంతరిక్షంలో ఇలాంటి వాటికి రక్షణ ఉండదు.


ఇక ఒక ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు ఒంటరిగా ఉంటే.. వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనించడం.. ఎంత ట్రైనింగ్ తీసుకున్నవారైనా ఈ ప్రభావాలను తప్పించడం కష్టం అవుతుంది. మరోవైపు.. భూమి నుంచి చాలా దూరం ప్రయాణించడంతో కమ్యూనికేషన్లు బలహీనపడతాయి. అలాంటి పరిస్థితులకు వ్యోమగాములను సిద్ధం చేయడం వంటి అంశాలు కూడా ఇందులో ఉంటాయి.


తాజాగా ఇస్రో, ఆకా స్పేస్‌ స్టూడియో, ది యూనివర్శిటీ ఆఫ్‌ లడఖ్‌, ఐఐటీ బాంబే, లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఈ అనలాగ్ మిషన్‌ కోసం కలిసి పనిచేస్తున్నాయి. చంద్రుడు, అంగారకుడపై ఉండే కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రదేశాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు లడఖ్‌లో గుర్తించారు. అక్కడ ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలను చూపడం, ఎత్తైన పర్వత ప్రదేశం కావడంతో.. స్పేస్ టెక్నాలజీల పరీక్షకు సుదీర్ఘ స్పేస్‌మిషన్‌ల వ్యూహాల తయారీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


అదే సమయంలో ఇతర గ్రహాల పరిస్థితులను అంచనా వేస్తూ.. వ్యోమగాములు అక్కడ ఉండటానికి తగిన ఏర్పాట్లను ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. అంతేకాకుండా స్పేస్‌లోకి తీసుకెళ్లే వనరులను ఎలా వాడుకోవాలో ఇక్కడే ప్రణాళికలు వేయనున్నారు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోని వ్యోమగాములను ఉంచి.. ఒంటరిగా ఉన్నపుడు వారిపై పడే ప్రభావాన్ని ఇక్కడ అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడి పైకి మానవ సహిత యాత్రలను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఇస్రోకు ఇది ఎంతో ఉపయోగపడనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com