మాజీ సీఎం జగన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ 11 ఏళ్ల నుంచి బెయిల్ పై బయట ఉన్నారని, కోర్టుకు కూడా వెళ్లడం లేదని తెలిపారు. మాయల పకీర్ ప్రాణం పక్షిలో ఉన్నట్టు... జగన్ కేసుల వ్యవహారం బీజేపీ చేతిలో ఉందని అన్నారు. జగన్ పై కేసుల వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదని, అంతలోనే జగన్-షర్మిల ఆస్తుల రగడ తెరపైకి వచ్చిందని తెలిపారు. జగన్ కేసుల వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించాలని, తద్వారా అన్నాచెల్లెళ్ల ఆస్తుల పంచాయితీ కూడా తేలిపోతుందని పేర్కొన్నారు. ఇక, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ప్రధాని మోదీ విమర్శించడం సిగ్గుచేటని నారాయణ వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధంగా మోదీ వ్యవహార శైలి ఉందని నారాయణ విమర్శించారు. అధికారం కోసం ఉత్తరాది, దక్షిణాది అని బీజేపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయని, జాతీయ పార్టీలు బలహీనపడుతున్నాయని వ్యాఖ్యానించారు. సీపీఐ జాతీయ స్థాయిలో బలోపేతం కావడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.