ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలో రుషికొండ భవనాలను పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రుషికొండపై కట్టిన భవనాలు చూశాక ఆశ్చర్యం, ఉద్వేగం కలిగాయని పేర్కొన్నారు. టూరిజం డెవలప్ మెంట్ కోసమే ఈ భవనాలు నిర్మించినట్టు గత ప్రభుత్వంలో అనేకసార్లు చెప్పారని, కానీ ఢిల్లీ పెద్దలు వచ్చినప్పుడు విశాఖలోని నేవీ అతిథి గృహంలోనే బస చేస్తుంటారని తెలిపారు. మరి ఎందుకు, ఎవరి కోసం రుషికొండ భవనాలు కట్టినట్టు? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తి స్వార్థం కోసమే రుషికొండ ప్యాలెస్ కట్టారని ఆరోపించారు.బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారని, గజపతి బ్లాక్ లో ఆఫీస్ కాంప్లెక్స్ కట్టారని వివరించారు. వీళ్లకు ఎక్కడ్నించి చూసినా సముద్రం వ్యూ కనిపించాలని, ఆ మేరకే భవనాలు కట్టారని చంద్రబాబు వెల్లడించారు. తన ప్యాలెస్ లన్నింటిలోకి ఇక్కడే అదిరిపోయే లగ్జరీ కనపడాలని కట్టించుకున్నట్టుందని వ్యాఖ్యానించారు. రుషికొండ భవన సముదాయంలోని కళింగ బ్లాక్ లో 300 మంది పట్టే కాన్ఫరెన్స్ హాల్ కట్టారని తెలిపారు. రాజులు కూడా ఇలాంటి ఆఫీసులు కట్టుకుంటారని నేను అనుకోవడంలేదు... వాళ్లకు ఇన్ని తెలివితేటలు లేవు. ఆ కారిడార్ చూస్తుంటే అమెరికా వైట్ హౌస్ లో కూడా అలాంటిది ఉండదేమో అనిపించింది. మన రాష్ట్రపతి భవన్ లోనూ లేదు... రాష్ట్రపతి భవన్ లో ఉన్నది చిన్న కారిడారే... మేం ఢిల్లీ వెళ్లినప్పుడు చూస్తుంటాం... నాడు బ్రిటీష్ వాళ్లు ప్లాన్ చేశారు కానీ, అది చాలా చిన్న కారిడార్. వాళ్ల పీఏలకు కూడా రూములు కట్టుకున్నారు, పెద్ద కాన్ఫరెన్స్ హాల్ పక్కనే చిన్న కాన్ఫరెన్స్ హాళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు గుండె చెదిరిపోయే వాస్తవాలు బయటికి వస్తున్నాయి... ఏకంగా 100 కేవీ సబ్ స్టేషన్, 200 టన్నుల సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. గతంలో షాండ్లియర్లు చూశాం... ఇక్కడ ఫ్యాన్సీ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది, సర్వెంట్ల కోసం ఒక పెద్ద బ్లాక్ కట్టారు. ఇలాంటివి కలలో కూడా ఊహించలేం. నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. నేను చాలా దేశాలు తిరిగాను కానీ, ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎలా వచ్చిందో అర్థం కావడంలేదు. మంచి నీళ్ల మాదిరిగా డబ్బులు ఖర్చు పెట్టారు. అవి వాళ్ల సొంత డబ్బులు కాదు. అన్ని నిబంధనలను ఉల్లంఘించారు. హైకోర్టును, ఎన్జీటీని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టారు. అధికారులను కూడా మభ్యపెట్టారు. ఇప్పుడవన్నీ కరెక్టుగా విచారణ జరిగితే ఎంతోమంది ఎగిరిపోతారు. ఇతడు ఒక దుర్మార్గుడు, ఒక కరడుగట్టిన నేరస్తుడు... అందుకే నేను అనేది ఎస్కోబార్ అని. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలా అనేదానిపై చర్చ జరగాలి. పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటాడు... పేదల పేరు చెప్పి ఇలాంటి విలాసవంతమైన భవనాలు కట్టుకుంటాడు. మనం చేసే పని తప్పా, ఒప్పా అనేది మనస్సాక్షి చెబుతుంది... అలాంటిది మనస్సాక్షిని కూడా లెక్కచేయని పరిస్థితికి వచ్చాడు" అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.