పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలను నిర్మించుకోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం (నవంబర్ 2) ఆయన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి రుషికొండలో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన భవనాలను పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. గుండె చెదిరిపోయే నిజాలు బయటకి వస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ కలలో కూడా ఊహించనివిధంగా.. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏవిధంగా కార్యక్రమాలు చేస్తాడనేది రుషికొండ భవనాలు చూశాకే తెలిసిందని చంద్రబాబు అన్నారు. పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేతలను ఎక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు.
‘రుషికొండ బీచ్ అనేది విశాఖ నగరంలోనే అత్యంత అందమైన ప్రాంతం. ఇక్కడి భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇలాంటి పనులు చేశారు. ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణం. గతంలో మీడియా, ఇతరులు ఎంత ప్రయత్నించినా రుషికొండపై ఏం చేస్తున్నారో బయటకి తెలియకుండా చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మభ్యపెట్టారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని చేయాలో అన్ని చేశారు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
‘ఈ భవనాలు చూస్తే ఆశ్చర్యంతో పాటు ఉద్వేగం కలిగింది. బాత్ టబ్ కోసమే ఏకంగా రూ. 36 లక్షలు ఖర్చు చేశారు. ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారు. ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన షాండ్లియర్లను కూడా నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. భవనాలకు మార్బుల్స్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చారు’ అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
పర్యాటక శాఖ కోసమే ఈ భవనాలను నిర్మించామని బుకాయించారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ‘వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ. 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ భవనాలకు కేటాయించిన నిధులు ఖర్చు పెడితే రాష్ట్రమంతటా రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తయ్యేది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా? ప్రజలు ఆలోచించాలి’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆ భవనాలను అందరికీ చూపిస్తామని.. వాటిని దేనికి వాడుకోవాలో తనకు అర్థం కావడంలేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏమిటో నాకు అర్థం కాలేదు. ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే.. వాళ్లు సమాధానం చెప్పాలి. గతంలో నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడకు రావాలని ప్రయత్నించాం. ఎవరినీ రానీయకుండా చేశారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అధికారం మాకు ప్రజలే ఇచ్చారు’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.