భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ఎంతో మంది రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నెహ్రూ నుంచి మొదలుకుంటే.. ప్రస్తుతం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా వరకు వివిధ తరాల వ్యక్తులు భారత రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి ఐదో తరం వ్యక్తి.. రాజకీయ అరంగేట్రానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా.. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసేలా ఇటీవల దీపావళి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ విడుదల చేసిన వీడియోలో తన మేనల్లుడు, ప్రియాంక గాంధీ వాద్రా-రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ రాజీవ్ వాద్రా కనిపించడంతో.. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది.
అయితే సరిగ్గా ప్రియాంక గాంధీ వాద్రా.. వయనాడ్ ఉపఎన్నికలో పోటీ చేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ రైహాన్ వాద్రా రాజకీయ అరంగేట్రం వార్తలు చక్కర్లు కొట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వీడియోలో రాహుల్ గాంధీతో రైహాన్ వాద్రా కలిసి ఉండటం.. అతన్ని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారనే సంకేతాలు ఇవ్వడమేనంటూ రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రా నామినేషన్ దాఖలు చేసే సమయంలో రైహాన్ వాద్రా కనిపించారు. అయితే రైహాన్ వాద్రా.. బయట కనిపించడం చాలా అరుదు.
24 ఏళ్ల విజువల్ ఆర్టిస్ట్, క్యూరేటర్ అయిన రైహాన్ రాజీవ్ వాద్రా.. పొలిటికల్ ఫీల్డ్‌కు చాలా దూరంగా ఉన్నారు. ఇక అతడు వైల్డ్ లైఫ్, కమర్షియల్ ఫొటోగ్రఫీ అంటే ఆసక్తి కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో రైహాన్ రాజీవ్ వాద్రా తన పనికి సంబంధించిన ఎగ్జిబిషన్ ప్రదర్శనలు చేశారు. ఇక రైహాన్ వాద్రా పొలిటికల్ ఎంట్రీపై కాంగ్రెస్ మద్దతుదారులు, వ్యతిరేకులు కూడా స్పందిస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ రైహాన్ వాద్రా పేరుతో ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.
ఇక మరికొందరు రాహుల్ గాంధీ, రైహాన్ వాద్రాల మధ్య పోలికలను పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ కూడా మొదట్లో రాజకీయాల్లోకి వచ్చినపుడు చాలా సిగ్గుపడేవాడని పేర్కొంటున్నారు. రాహుల్ గాంధీ దీపావళి వీడియోలో కూడా రైహాన్ వాద్రా కొంచెం భయం, ఆందోళనకరంగా కనిపించారు. అయితే ఇప్పటికే రాజకీయాల్లో గాంధీ కుటుంబం ఉందని.. బీజేపీ సహా వివిధ పార్టీలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ.. రైహాన్ వాద్రా పొలిటికల్ ఎంట్రీ తీవ్ర చర్చకు దారి తీస్తోంది.