ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే.. ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వరుసగా మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత ఎందుకు కేసులు పెట్టడం లేదంటూ ప్రశ్నించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా వంటి నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్కే రోజా.. ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని రోజా ప్రశ్నించారు. జనసేన ప్రశ్నించే పార్టీ అని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. చంద్రబాబు పాలనలో పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ వేసుకున్నారంటూ సెటైర్లు వేశారు. తొక్కి నారతీస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్‌కు.. ప్రజలే నొక్కి తాటతీస్తారంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లాకు చెందిన వాడు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నామంటూ రోజా వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను సూపర్ చీటింగ్ చేస్తున్నారని రోజా విమర్శించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన ఉచితంలో ఉచితం లేదని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఈవీఎం ప్రొడక్షన్స్ వారి సీబీఎన్ ప్రభుత్వమంటూ ఎద్దేవా చేసిన రోజా.. గత ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలతోనే వైసీపీ ఓడిపోయిందని అన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ వేధింపులకు గురిచేస్తున్నారని రోజా ఆరోపించారు. విజయవాడ నగరాన్ని వరదల్లో ముంచారని.. పులిహార పొట్లాల పేరుతో కోట్లు దోచుకున్నారంటూ రోజా ఆరోపించారు.వైఎస్ జగన్‌ను మరోసారి సీఎం చేసేందుకు ఇప్పటి నుంచి కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారాల కారణంగా ఓడిపోయామని.. ఈసారి అలాంటి తప్పులు జరగకుండా పనిచేయాలంటూ కార్యకర్తలకు సూచించారు.