ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో ముఖ్యం. ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటాయి. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకూ ఈ నాగ్‌పూర్ హైవేను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణ పనులను మేఘా సంస్థ, డీఆర్‌బీ సంస్థ చేపడుతున్నాయి. రెండు ప్యాకేజీలను మేఘా సంస్థ, మరో ప్యాకేజీని డీఆర్‌బీ సంస్థ దక్కించుకున్నాయి.
ఇక ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తైంది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. వరంగల్ నుంచి ఖమ్మం కలుపుతూ విజయవాడ వరకూ రహదారి నిర్మాణం జరగనుంది. అలాగే 16వ నంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేస్తారు. ఇక ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వరకూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. ఆరు వరుసలుగా 90 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లటం ఈజీ అవుతుంది.
మరోవైపు.. ఖమ్మం విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులకు రూ.4,600 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ పనులను మేఘా సంస్థ చేపడుతోంది. 90 కిలోమీటర్ల ఉండే ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే ఖమ్మం నుంచి బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, ఏపీలోని చెరువు మాధవరం, జి.కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుతుంది. అలాగే జక్కంపూడి సమీపంలో విజయవాడ బైపాస్‌కు అనుసంధానం చేస్తారు. ఈ ఎక్స్‌ప్రెవే అందుబాటులోకి వస్తే విజయవాడ ఖమ్మం మధ్య దూరం 30 నుంచి 40 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 26 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరుగనుంది. ఇక రహదారి నిర్మాణం కోసం ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ పూర్తి చేశారు. అలాగే విజయవాడ రూరల్‌లోనూ పలు సర్వే నెంబర్లలో భూసేకరణ చేసి పరిహారం చెల్లించారు. మొత్తం 93.8198 హెక్టార్ల భూమిని సేకరించారు. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. కొన్ని భూముల్లో రైతులు పంటలు వేశారు. దీంతో సీజన్ పూర్తయ్యాక అధికారులు స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించనున్నారు.