పల్నాడు జిల్లా, నరసరావుపేట ప్రభుత్వాస్పత్రిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహం తొలగింపుపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడెల కృషి వల్లే నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు అయ్యిందన్నారు. అమెరికాలో చదువుకుంటున్న తన స్నేహితుల నుంచి తీసుకొచ్చిన చందాలతో పల్నాడు ప్రాంత ప్రజల కోసం కోడెల శివప్రసాద్ సకల సౌకర్యాలతో పెద్ద ఆస్పత్రి నిర్మాణం చేయించారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహం తొలగింపు బాధకరమన్నారు. కోడెల విగ్రహాన్ని తొలగించారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. విగ్రహం తొలగించిన వారికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. కోడెల విగ్రహం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడును కోరతానన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు అంతా చర్చించుకుని కోడెల శివప్రసాద్ విగ్రహాన్ని పున:ప్రతిష్ట చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు.