గత రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో అదృశ్యమైన యానాది కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ బాలుర కేసును పోలీసులు చేధించారు. జిల్లా అంతటా 20 పోలీస్ ప్రత్యేక బృందాలు గాలించగా నందివాడ మండలం తమిరిశ వద్ద బాలురను గుర్తించిన పోలీసులు తండ్రి చెంతకు చేర్చారు. ముగ్గురు పిల్లల తల్లి ఆరు నెలల క్రితం మృతి చెందగా తండ్రి రాఘవులు ఒక్కడే వీరిని సాకుతున్నాడు. రాఘవులు పిల్లలను ఇంటి వద్దే వదిలి గత నెల 30వ తేదీన అవనిగడ్డ వెళ్లాడు.
నవంబర్1వ తేదీ వరకు తన తండ్రి ఇంటికి రాకపోవటంతో తండ్రి మీద బెంగతో ముగ్గురు పిల్లలు కాలి నడకన అవనిగడ్డకు పయనమవ్వగా జీలగలగండి వద్ద నందివాడకు చెందిన ఆటో డ్రైవర్ అయ్యప్ప వీరిని గమనించి ఆటో ఎక్కించుకున్నాడు. ముగ్గురిని వారి ఇంటి వద్ద దించే ప్రయత్నం చేయగా పిల్లలు వారి వివరాలు చెప్పకపోవటంతో తనతోపాటు నందివాడ తీసుకుని వెళ్లాడు. తమకు అందిన సమాచారం మేరకు నందివాడ పోలీసులు ముగ్గురు పిల్లలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ అబ్దుల్ సుభాన్ మీడియాకు తెలిపారు.