తిరుమలలో నవంబరు 5వ తేదీన శ్రీవారు పెద్దశేష వాహనంపై దర్శనమిస్తారు. మంగళవారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా.. రాత్రి 7 నుంచి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు దర్శనం ఇస్తారు. 'సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు'అని చెబుతారు. 'ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు'అంటారు.
మరోవైపు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సంవత్సరం పొడవునా అనేక ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా.. శ్రీవారి పరమ భక్తుల తిరు నక్షత్రోత్సవాలు కూడా టీటీడీ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నవంబరు 3వ తేదీ ఆదివారం తిరుమల నంబి శాత్తుమొర వైభవంగా జరిగింది. శ్రీ వైష్ణవ భక్తుడైన తిరుమలనంబి తిరుమలలో తీర్థ కైంకర్యాన్ని ప్రారంభించారు. శ్రీవారి ఆలయం దక్షిణ మాడ వీధిలో శ్రీ తిరుమల నంబి ఆలయం కూడా ఉంది. శ్రీ రామానుజాచార్యుల అంశతో జన్మించిన శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర నవంబరు 6న జరగనుంది. నవంబరు 9న అత్రి మహర్షి, శ్రీ పిళ్ళైలోకాచార్య, శ్రీ పోయిగై ఆళ్వార్, శ్రీ భూదత్తాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలతో పాటు, శ్రీ వేదాంత దేశికాచార్య శాత్తుమోరతో కూడా జరుగనుంది. నవంబరు 10న శ్రీ పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి జరగనున్నాయి .
కపిలేశ్వరాలయంలో విశేషపూజ హోమ మహోత్సవాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పంచమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, విభూదితో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం గణపతిపూజ, పుణ్యహవచనం, వాస్తుపూజ, పర్యగ్నికరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించనున్నారు. నవంబరు 3, 4వ తేదీలలో కూడా గణపతి హోమం జరుగనుంది.
నవంబరు 5 నుండి 7వ తేదీ వరకు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. నవంబరు 7న సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. అదేవిధంగా నవంబరు 8న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం) నిర్వహించనున్నారు. నవంబరు 29న శ్రీ శివపార్వతుల కల్యాణం చేపడతారు.
నవంబరు 30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa